బీసీసీఐ అధ్యక్షుడు, బెంగాల్ టైగర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో రాబోతున్నది. నిజానికి చాలా రోజులుగా దాదా బయోపిక్ వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బయోపిక్ చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దాదా చెప్పడంతో బయోపిక్ తెరకెక్కబోతున్నది. హీరో, డైరెక్టర్ పేర్లని గోప్యంగా ఉంచిన దాదా ఈ సినిమా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్టు ప్రకటించాడు.
భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై తీసిన ‘ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా భారీ హిట్టయింది. ఆ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితంపైనా ఓ డాక్యుమెంటరీ మూవీ విడుదలైంది. మరోవైపు భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి బయోపిక్లపైనా చర్చలు నడుస్తున్నాయి.
ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ బాస్ సౌరవ్ గంగూలీ ఆ జాబితాలో చేరిపోయాడు.ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం హిందీలో మాత్రమే తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు టాక్.
గంగూలీ కొంతకాలం పాటు ప్రముఖ నటి నగ్మాతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం కూడా బయోపిక్‌లో యాడ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనే విషయాలపై క్లారిటీ లేదు. మరోవైపు త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం గంగూలీ బయోపిక్ లో ‘రణ్‌బీర్ కపూర్’ టైటిల్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇది ఎంతనిజమో కాలమే నిర్ణయించాలి.