అన్ స్టాపబుల్ సీజన్ 2లో అన్ని ఎపిసోడ్స్ కి బాప్ ఎపిసోడ్ అయిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎప్పుడో గానీ ఒకే వేదిక మీద చూడనటువంటి వాళ్ళని ఒక రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడించడం.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం ఆహాకే చెల్లింది. అందులోనూ బాలకృష్ణ, పవన్ కాంబినేషన్ అనేది చాలా రేర్. అలాంటి కాంబినేషన్ లో సినిమా పడితే పండగలా ఉంటుంది. అలాంటిది సినిమా లేకపోయినా.. 2 గంటల పాటు ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనబడితే అదే పెద్ద సినిమాగా అభిమానులు ఉప్పొంగిపోయే పరిస్థితి. తాజా పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే షోకి పవన్ ని ఆహ్వానించడంతో ఆహా వారు ఫ్యాన్ వార్స్ కి తెరదించినట్టే అని అనుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ పవన్ ఎపిసోడ్ రెండు భాగాలుగా వస్తోంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలైంది. రెండవ భాగానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. మొదటి ఎపిసోడ్ సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో సాగిపోగా.. రెండవ ఎపిసోడ్ మాత్రం పూర్తిగా రాజకీయ అంశాల గురించి ఉంటుందన్న విషయం ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఆ జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటున్నావ్.. ఎవరినైనా కొట్టకుండా ఆపుకోవడానికా అంటూ సరదాగా మొదలుపెట్టిన బాలయ్య.. సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పవన్ ను సూటి ప్రశ్నలు అడగ్గా.. వాటికి పవన్ ఘాటైన సమాధానాలు ఇచ్చారు. ‘నీకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.. ఆ అభిమానం ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు’ అని బాలయ్య అడిగారు. ఎవరైనా ఒకరు ఎదుగుతా ఉంటే రానివ్వపోవడం అనేది వ్యూహంలో భాగమని అన్నారు.
మ్యానిఫెస్టో పూర్తిగా జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లే ఏమో అని.. ఓటమికి కారణం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసలు జనసేన పార్టీ ప్రారంభించాల్సిన అవసరం ఏముంది అని అడగ్గా.. పవన్ బదులిచ్చారు. ఎంతసేపూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం గానీ ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం. ఆ తర్వాత మీరు టీడీపీలో చేరవచ్చు కదా అని బాలయ్య అడగ్గా.. పవన్ ఏం సమాధానం చెప్తారన్న విషయంపై ఆసక్తి ఏర్పడింది. బేసిగ్గా పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి ఉందని అన్నారు. ఇక ఈ షోలో ఒక పెద్దావిడ రావడం షోకి హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన నాల్గవ కొడుకు అని చెప్పి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పెద్దావిడను తీసుకొచ్చారు. కరోనా కారణంగా తన ఇద్దరి కొడుకులను కోల్పోయానని.. తనకున్న ఒక కొడుక్కి తోడుగా పవన్ ఒక కొడుకని అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత చచ్చిపోతానని ఆమె అనడంతో ఎమోషనల్ గా సాగింది.
ఇక ఈ షో మధ్యలో దర్శకుడు క్రిష్ రావడంతో షోకి మరింత శోభ వచ్చింది. నాతో సినిమా చేశావ్, పవన్ తో సినిమా చేసావ్.. మా ఇద్దరిలో ఏం గమనించావ్’ అని బాలయ్య క్రిష్ ని అడగ్గా.. ఒక సింహం, ఒక పులి మధ్యలో నా తలా ఉందంటూ చమత్కరించారు. ఆ తర్వాత బాలకృష్ణ.. పవన్ ను సినిమాలు మానేసి ప్రజా సేవకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. దీనికి క్రిష్ సహా.. అక్కడున్న అభిమానులందరూ అవును అంటూ సమాధానమిచ్చారు. ‘నీ సమాధానం ఏంటి భయ్యా అని పవన్ ని అడగ్గా.. ఆయన కాగితం మీద ఏదో రాస్తూ కనిపించారు. మరి ఆ సమాధానం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ షో మొత్తంలో బాలకృష్ణ.. పవన్ ను జనసేన పార్టీ ఎందుకు పెట్టారు? తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు కదా అని అడిగిన ప్రశ్నలు హైలైట్ గా నిలిచాయి. వీటికి పవన్ ఎలా స్పందించారనేది చూడాలి. ఈ షో రెండవ భాగం ఫిబ్రవరి 10 నుంచి ప్రసారం కానుంది. మరి బాలయ్య అడిగిన ప్రశ్నలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.