బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర ట్రైలర్ రానే వచ్చింది. ఒక్క బాలీవుడ్ నుంచే కాకుండా.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు, సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాని మొత్తం మూడు భాగాల్లో తెరకెక్కించనున్నారు. మొదటి భాంగగా రాబోతున్న ‘బ్రహ్మాస్త్ర శివ’ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి బాలీవుడ్ వర్గాల్లో ఓ ప్రచారం జోరందుకుంది. ఈ సినిమా కచ్చితంగా బాహుబలిని బీట్ చేసి బాలీవుడ్ సత్తా చాటుతుందని ఊదరకొట్టడం మొదలు పెట్టారు. మరి.. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ విడుదల తర్వాత ఎలాంటి టాక్ వస్తోందో చూద్దాం.
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. వివిధ అస్త్రాల ప్రాముఖ్యత, విశిష్టతను తెలియజేస్తూ మూడు భాగాల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రణబీర్ కపూర్- అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీరాయ్ లాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ తారాగణం, భారీ బడ్జెట్ చూసిన తర్వాత బాలీవుడ్ లో అంతా బాహుబలిని బీట్ చేస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో జోరుమీదున్న సౌత్ సినిమాల జోరుకు ఈ సినిమా కళ్లెం వేస్తుందని కూడా బీరాలు పలికారు.
అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. ఎవరైతే బాహుబలిని బీట్ చేస్తుందని చెప్పుకొచ్చారో వారంతా నోరు మెదపడంలేదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ దాదాపు 60 శాతం గ్రాఫిక్స్ తోనే నడిపించారు.. చూస్తుంటే చిన్న పిల్లల యానిమేషన్ మూవీ చూస్తున్నట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే భాషతో సంబంధం లేకుండా.. సౌత్, నార్త్ అందరి అభిమానులు అంతా పెదవి విరుస్తున్నట్లుగానే ఉంది. ఎందుకంటే పెద్ద తారాగణం ఉంది సరే.. కానీ, అంతా గ్రాఫిక్స్ సినిమాలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను ఎలా బద్దలు కొట్టాలని మీరు భావిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్.. బాహుబలిని బీట్ చేయగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.