రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి కోడి పందేలు, గాలిపటాలు, పిండి వంటలు ఎలాగో.. ప్రేక్షకులకు సినిమాలు కూడా అంతేే ప్రత్యేకం. అందుకే టాలీవుడ్ కి సంక్రాంతి అంత స్పెషల్. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. జనవరి 12న వీర సింహారెడ్డిగా బాలయ్య వస్తుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్న విషయం తెలిసిందే.
చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ వద్ద చిరు- బాలయ్య పోరు చూడబోతున్నాం. చిరు- బాలయ్య అభిమానులు సంబరాలు అప్పుడే షురూ చేశారు కూడా. ఇప్పుడు మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థకు కూడా రెండు శుభవార్తలు వచ్చాయి. ఒకటి ఈ రెండు సినిమాలకు స్పెషల్ షోస్ వేసుకునేేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. విడుదల రోజున 6 ఆటలు వేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. అంటే జనవరి 12న తెల్లవారుజామున 4 గంటలకే వీర సింహారెడ్డి షో పడనుంది. అలాగే జనవరి 13న తెల్లవారుజామున 4 గంటలకే వాల్తేరు వీరయ్య షో పడుతుంది.
ఇప్పుడు మైత్రీ మూవీస్ సంస్థకు అందిన రెండో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఏపీలో ఈ రెండు సినిమాల టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయి. వీర సింహారెడ్డి- వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ ధరలను పెంచుకోవడానికి జగన్ సర్కారు పర్మిషన్ ఇచ్చింది. అయిత మైత్రీ మూవీస్ రూ.70 పెంపుదలకు అనుమతి కోరగా.. ఏపీ సర్కార్ రూ.45 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్తలతో అటు హీరోల అభిమానులే కాదు.. నిర్మాణ సంస్థ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాలు సూపర్ హిట్ కావాలని ఇద్దరు హీరోలు కోరుకుంటున్నారు. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అయ్యి నిర్మాణ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టాలని ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కోరుకున్నారు. మరోవైపు ఈ రెండు సినిమాల దృష్ట్యా దిల్ రాజు తన వారసుడు సినిమాని జనవరి 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. చివరి వరకు సస్పెన్స్ లో పెట్టి.. చివర్లో సినిమాని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.