మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది. ఇక అంతే.. దీనిలో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నాటుకుపోయింది. మరునాడు ఆంజనేయస్వామి తన శరీరమంతా సింధూరం రాసుకుని సభకు వెళ్లాడు. సభలో శ్రీరాముడు ఆంజనేయస్వామిని పిలిచి ఏమిటి ఇలా ఒళ్లంతా సింధూరం రాసుకున్నావు అని అడగగా సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పాడు.
అంతే రాముడు ఆంజనేయస్వామి భక్తికి పరవశుడయ్యాడు. వెంటనే ఒక వరం ఇచ్చాడు. ‘భక్తికి నువ్వు ఉదాహరణ.ఇక నుండి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను’ అని శ్రీరామచంద్ర మూర్తి చెప్తాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది.
ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.