వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీకి చెందిన చిలకా షిప్ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్ అడ్వెంచర్స్ సంస్థను సంప్రదించాయి.
పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్ షిప్ అని తెలిసింది. అయితే ఈ షిప్ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్ అడ్వెంచర్స్ సంస్థ సమాయత్తమవుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ బృందం భావనపాడు తీరంలో అన్వేషణ సాగించాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అన్వేషణ మొదలు పెట్టనున్నారు.