టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టును వీడే యోచనలో గిల్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
క్రికెట్లో జాతీయ జట్లకు ఆడే అవకాశాలు రావడం చాలా కష్టం. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసినా ఒక్కోసారి ఛాన్స్ రాకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకొని తమను తాము ప్రూవ్ చేసుకున్న ప్లేయర్లకు మాత్రం తిరుగుండదు. కానీ ఫెయిలైతే మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అంత సులువు కాదు. టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తనకు వచ్చిన ప్రతి ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాడు. మ్యాచ్‌కు మ్యాచ్‌కు తన గేమ్‌ను మరింత ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. దీని వల్ల అటు జాతీయ జట్టుతో పాటు ఇటు కాసులు కురిపించే ఐపీఎల్‌లోనూ దుమ్మరేపుతున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు గిల్. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ ఏడాది అదరగొట్టాడు. రెండు సెంచరీలు సహా 890 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తొలి ఐపీఎల్ కప్ గెలవడంలోనూ, ఈ ఏడాది టోర్నీ ఫైనల్‌కు చేరడంలోనూ శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌లో శుబ్‌మన్ గిల్ ప్రధాన బలంగా మారాడు. అలాంటి గిల్ గుజరాత్ ఫ్రాంచైజీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్-2024లో గుజరాత్‌కు గుడ్ బై చెప్పి.. ఇతర జట్టులో చేరాలనే యోచనలో ఈ భారత ఓపెనర్ ఉన్నట్లు సమాచారం. గుజరాత్ టీమ్‌లో తనకు పెద్దగా ఫ్యూచర్ ఉండదని గిల్ భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే. ఈ నేపథ్యంలో అతడు ఫిట్‌గా ఉంటే మరో 7 నుంచి 8 సంవత్సరాలు గుజరాత్‌ను సారథిగా ముందుండి నడిపే అవకాశాలు ఉన్నాయి. దీంతో గుజరాత్‌కు ఎన్నేళ్లు ఆడినా ప్లేయర్‌గానే ఉండిపోతాననే భయం గిల్లో ఉందట. అందుకే వచ్చే ఐపీఎల్లో తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసే టీమ్‌కు మారాలని గిల్ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్ వినిపిస్తోంది.
వచ్చే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు మారాలనే ఆలోచనలో శుబ్‌మన్ గిల్ ఉన్నట్లు సమాచారం. ఈ రెండు టీమ్స్‌కు రెగ్యులర్ కెప్టెన్ లేడు. ఈ నేపథ్యంలో తనను కెప్టెన్ చేస్తే గుజరాత్ టీమ్‌లో ఉండాలని లేదా జట్టును వీడాలని అతడు ఫిక్స్ అయ్యాడట. సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్‌లో పంజాబ్ వైపే గిల్ మొగ్గుచూపే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. ఐపీఎల్లో సొంత నగరాలకు ఆడటం, కెప్టెన్సీ చేయడం గొప్పగా భావిస్తారు. తమ సొంత సిటీకి చెందిన ఫ్రాంచైజీలకు గతంలో కొందరు స్టార్లు కెప్టెన్సీ చేశారు. ముంబై ఇండియన్స్‌కు సచిన్ టెండూల్కర్, ఆర్సీబీకి అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సౌరవ్ గంగూలీ లాంటి వాళ్లు నాయకత్వం వహించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ తన సొంత నగరమైన ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ లెక్కన తన సొంత రాష్ట్రానికి చెందిన పంజాబ్ కింగ్స్ టీమ్‌కు గిల్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది గుజరాత్ టైటాన్స్ లేదా గిల్ క్లారిటీ ఇస్తే కానీ చెప్పలేం.