ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటికే 7 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇవాళ గువహటి వేదికగా రాజస్థాన్- పంజాబ్ కింగ్స్ జట్లు 8వ మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నాయి. అయితే వీటిలో ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తుందో చూద్దాం.
ఐపీఎల్ 2023లో ప్రతి జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తాపత్రయ పడుతోంది. మరోవైపు అభిమానులు తమ జట్లు గెలవాలంటూ తెగ మొక్కేస్తున్నారు. ఇంక బుధవారం గువహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు మొదటి మ్యాచ్ గెలిచి తమ విన్నింగ్ స్ట్రీక్ ని కొనసాగించాలని కుతూహలంగా ఉన్నారు. రెండు జట్లు తలపడితే కచ్చితంగా ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు. మరి ఈ రెండు జట్లలో విజేతగా నిలిచేదెవరు? విన్నింగ్ స్ట్రీక్ ని కొనసాగించేదెవరు? జట్ల బలాబలాలను బట్టి అసలు ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?
గువహటి స్టేడియంలో సాధారణంగానే బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ను తయారు చేస్తుంటారు. ఇక్కడ కచ్చితంగా పరుగుల వరదను కోరుకోవచ్చు. రెండు జట్లు బ్యాటింగ్ లో ధనాధన్ పర్ఫార్మెన్స్ చేశాయి. తమ తొలి మ్యాచ్ లో పంజాబ్ జట్టు 191 పరుగులు స్కోర్ చేయగా.. హైదరాబాద్ పై రాజస్థాన్ 203 పరుగులు స్కోర్ చేసింది. పంజాబ్ లో ధావన్, రాజపక్స, ప్రభ్ సిమ్రాన్, జితేశ్ శర్మ మంచి టచ్ లో ఉన్నారు. ధావన్, సికందర్ రజా మరింత ఫామ్ లోకి వస్తే.. పంజాబ్ జట్టు 200+ స్కోర్ చేయడం కష్టమేమీ కాదు. రాజస్థాన్ లో బ్యాటర్లు అంత మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. తొలి మ్యాచ్ లో జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ అర్ధ శతకాలు నమోదు చేసి ఔరా అనిపించారు. హెట్ మేయర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంక రియాన్ పరాగ్, పడిక్కల్ టచ్ లోకి వస్తే.. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో కూడా 200 దాటి స్కోర్ చేయగలరు.
ఈ మ్యాచ్ లో బౌలర్లు ప్రభావం పెద్దగా ఉంటుందని అనుకోవడం లేదు. కానీ, బాల్ కాస్త టర్న్ అయినా కూడా బౌలర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్, చాహల్, అశ్విన్ వంటి వెల్ ఎక్స్ పీరియన్స్ డ్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా చాహల్ కు రైట్ హ్యాండర్స్ పై మంచి పట్టు ఉంది. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, ప్రభమ్ సిమ్రాన్ వంటి బ్యాటర్లపై చాహల్ కు మంచి రికార్డు ఉంది. ఇంక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే.. సామ్ కరణ్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ లు ఉన్నారు. జైశ్వాల్ పై రాహుల్ చాహర్ కు మంచి పట్టు ఉంది. కాబట్టి రాహుల్ చాహర్ కి ఈ మ్యాచ్ లో ఎర్లీగా బౌలింగ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అర్షదీప్ సింగ్ తొలి మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్ రిపీట్ అయితే మాత్రం రాజస్థాన్ ఇబ్బందుల్లో పడినట్లే అవుతుంది.
యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, హెట్ మేయర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్ సిమ్రాన్ సింగ్, రాజపక్స, జితేశ్ శర్మ, సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరణ్, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ఎవరిది విజయం?: మైదానం బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉండటం, ఒకవేళ బౌలర్లకు సపోర్ట్ చేసినా రాజస్థాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది. (గమనిక: ఐపీఎల్ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించలేం. కాబట్టి ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.)