వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 15 లక్షలకు అమ్ముతానని ఆయన చెబుతున్నారు. ముర్రా జాతి దున్నలను కొనేందుకు డెయిరీలు నిర్వహించే వారు ఆసక్తి చూపుతారని, అందుకే ఆ దున్నకు అంత ధర పలుకుతోందని స్థానిక పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు. ఎందుకు అంత ఖరీదు ఆ జాతి గేదెకు!?. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్దం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవజాతుల్లో అత్యంత శ్రేష్టమైన ది, పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది ముర్రా జాతి. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం.
గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు. సుమారు రోజుకు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతో దఢమైన దూడలనిస్తాయి. దూడబరువు రోజువారీగా 400–500 గ్రాములు పెరుగుతూ తొందరగా ఎదకు వస్తాయి. ప్రభుత్వం సాధారణ మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమతి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్గిస్తోంది. ఇందులో సుమారు 25 నుంచి 50 శాతం వరకు సబ్సీడీ కూడా వర్తిస్తుంది. గేదె చనిపోతె ఇన్సూరెన్సు వారు మెత్తంగా చెల్లిస్తారు. మధ్య తరగతి కుటుంబాలు ఒకేసారి 5 నుంచి 10 గేదెల ద్వారా మినీ డెయిరీని పెట్టుకునే వారు బ్యాంకు వారిని సంప్రదిస్తే మెరుగైన వివరాలు తెలియజేస్తారు.