సీజన్ మారినప్పుడు చాలా మంది అనారోగ్యం బారిన పడతారు. సీజనల్ వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం పోయి వేసవి కాలం వచ్చింది. అయితే ఈ మార్పు వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనబడితే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కోవిడ్ 19 తర్వాత ఇదొక ట్రెండ్ గా మారింది. అయితే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా జ్వరం కేసులు ఎక్కువయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడే వారి సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. జ్వరం, దగ్గు, వికారం, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక సూచనలు చేసింది. ఈ లక్షణాలు కనబడితే యాంటీబయాటిక్స్ వాడుతున్నారని.. అయితే వీటికి దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది. ఈ లక్షణాలు కనిపించగానే చాలా మంది అజిత్రోమైసిన్, అమోగ్జిక్లాప్ వంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నారని.. అయితే ఎంత డోసేజ్ తీసుకోవాలి, ఎంత గ్యాప్ లో తీసుకోవాలనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదని ఐఎంసీ వెల్లడించింది.
లక్షణాలు కనబడగానే యాంటీబయాటిక్స్ వాడటం.. లక్షణాలు తగ్గుముఖం పట్టగానే యాంటీబయాటిక్స్ వాడడం మానేస్తున్నారని.. దీని వల్ల యాంటీబయాటిక్స్ నిరోధక శక్తి సూక్ష్మజీవులకు లభిస్తుందని, శరీరానికి నిజంగా అవసరమైన సమయంలో యాంటీబయాటిక్స్ అనేవి పని చేయకుండా పోతాయని ఐఎంసీ హెచ్చరించింది. రోగ లక్షణాలను బట్టి చికిత్స అందించాలని వైద్యులకు సూచించిన ఐఎంఏ రోగులకు యాంటీబయాటిక్స్ ఇచ్చే అలవాటును మానుకోవాలని వెల్లడించింది. అమోక్సీసిలిన్, నోర్ ఫ్లోక్సాసిన్, సిప్రోఫ్లోక్సాసిన్, ఓఫ్లోక్సాసిన్, లెవ్ ఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్ దుర్వినియోగం అవుతున్నాయని ఐఎంఏ పేర్కొంది. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం అవ్వడమే కాకుండా.. ఎక్కువగా వీటిని వాడితే రెసిస్టెన్స్ వస్తుందని హెచ్చరించింది.
ఇప్పటికే కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్ మెస్టిన్ మందుల వాడకం విపరీతంగా పెరిగిందని వెల్లడించిన ఐఎంఏ వాటి వల్ల కూడా రెసిస్టెన్స్ వస్తుందని హెచ్చరించింది. 70 శాతం డయేరియా కేసులు వైరల్ డయేరియాకు సంబంధించినవే అని.. అయితే ఈ కేసుల్లో వైద్యులు యాంటీబయాటిక్స్ అవసరం లేకపోయినా ప్రిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తుండడంపై ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. యాంటీబయాటిక్స్ ఇచ్చే ముందు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ నో కాదో అనేది పరీక్షలు చేసి తెలుసుకోవాలని వైద్యులకు ఐఎంఏ సూచించింది. యాంటీబయాటిక్స్ వాడకం విషయంలో స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని కోరింది. ఇన్ ఫ్లుయెంజా, ఇతర వైరస్ ల కారణంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రావడం సహజమేనని ఐఎంఏ తెలిపింది.
15 ఏళ్ల లోపు పిల్లలకు, 50 ఏళ్ళు దాటిన వారు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఐఎంఏ తెలిపింది. వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం వస్తాయని.. వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని హెచ్చరించింది. సాధారణంగా ఇన్ ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ ఐదు నుంచి వారం రోజులు ఉంటుందని.. మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది. కానీ దగ్గు మాత్రం మూడు వారాల వరకూ ఉండే అవకాశం ఉందని ఐఎంఏ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించిన వివరాల ప్రకారం హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ కారణంగా ఈ కేసులు వస్తున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదని.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యాక్సిన్లు తీసుకోవాలని ఐఎంఏ సూచించింది.
Fever cases on rise – Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho
— Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023