వేసవికాలం వచ్చేయడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. దేశంలో ఎక్కడ లేనంతగా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవడానికి ఒక్కటే మార్గం.. ఏసీ. అందుకే.. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎయిర్ కండిషనర్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే.. కరెంటు బిల్లులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయనుకోండి.
నిజానికి ప్రస్తుతమున్న ఎండల నుంచి బయటపడడానికి 24 గంటలు కూడా ఏసీ ఆన్ లోనే పెడుతున్నారు. అయితే ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక.. ప్రతి రోజూ ఏసి ఉపయోగిస్తే ఇక కరెంట్ బిల్లు సంగతి చెప్పక్కర్లేదు. అయితే.. ఏసీ రన్ అవ్వాలి కానీ.. కరెంటు బిల్ తక్కువ రావాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటిని పాటిస్తే.. ఎంతో కొంత మొత్తంలో కరెంటు బిల్ సేవ్ అవుతుంది.
సరైన టెంపరేచర్ వద్ద ఏసీ రన్ చేయడం..
వాస్తవానికి తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీ రన్ చేయకూడదు. 15 నుంచి 16 డిగ్రీల వద్ద ఏసీని నడపడం వల్ల చల్లగా ఉండవచ్చు. కానీ కరెంటు బిల్లు మాత్రం ఓక రేంజ్ లోవస్తుంది. కనుక.. 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. ఈ ఉష్ణోగ్రత మన శరీరానికి ఉత్తమమైనది. కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రాదు.
ఏసీలో టైమర్ సెట్ చేయండి
ఈ రోజుల్లో ఏసీలకు టైమర్ ఉంటోంది. రాత్రిపూట ఏసీ టైమర్ నిసెట్ చేయడం మంచిది. గది పూర్తిగా చల్లబడినప్పుడు టైమర్ ప్రకారం దానంతట అదే ఆగిపోతుంది. దీంతో ఖర్చులు ఆదా అవుతాయి.
ఎయిర్ ఫిల్టర్స్ శుభ్రంగా ఉంచుకోవడం..
వాస్తవానికి అన్ని ఎలక్ట్రికల్ గాడ్జెట్లని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాలి. ఏసీ విషయంలో కూడా ఇది జరగాలి. భారతదేశంలో ఏసీ ని ఏడాది పొడవునా వినియోగించరు. శీతాకాలంలో దీనిని పక్కన పెడుతారు. కాబట్టి దానికి సర్వీసింగ్ అవసరం అవుతుంది. ఏసీలో దుమ్ము పేరుకుపోతే అది పనిచేయకుండా పోతుంది. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏసీకి సర్వీసింగ్ కూడా అవసరమే. 30 నుండి 90 రోజులు మధ్య మీరు ఫిల్టర్లని శుభ్రం చేసుకోవడం మంచిది.
పవర్ బటన్ను ఆఫ్ చేయడం..
ఏసీ ఉపయోగంలో లేనప్పుడు దాని పవర్ బటన్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది రిమోట్ తో ఏసీని ఆఫ్ చేసి పవర్ బటన్ మాత్రం అలానే వదిలేస్తారు. దీని వల్ల అనవసరంగా కరెంటు ఖర్చవుతుంది. బిల్లు పెరుగుతుంది.
తలుపులు-కిటికీలు మూసి ఉంచడం..
ఏసీ ఆన్ చేసే ముందు తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. బయటి గాలి లోపలికి వచ్చినా, లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్ చేసి వేస్ట్, అనవసరంగా కరెంటు ఖర్చు పెరుగుతుంది. గది చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. వాస్తవానికి కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచినట్లయితే గది త్వరగా చల్లబడుతుంది.
సూర్య కిరణాలను లోపలికి రానివ్వకుండా..
నిజానికి సూర్య కిరణాల వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ వేసవి కాలంలో సూర్యకిరణాలు మన మీద పడడంవల్ల మరింత వేడి కలుగుతుంది. సూర్య కిరణాలు లోపలికి వచ్చాయంటే గది చల్లబడటం కష్టమవుతుంది. పైగా ఏసీ నుండి వచ్చే చల్లదనం కూడా తగ్గిపోతుంది. దీంతో గది చల్లబడడానికి ఎక్కువ సేపు పడుతుంది. పైగా ఎక్కువ సేపు ఏసి వేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మీ గదిలో ఉండే కిటికీలను కర్టెన్లతో కట్టేయండి. దీనితో గది త్వరగా చల్లగా ఉంటుంది మరియు బిల్లును కూడా ఆదా చేసుకోవచ్చు.