ఇప్పుడంటే జనరేషన్ మార్పులు వచ్చి అన్నిటిలోనూ సమాన వాటా కావాలని కొంతమంది ఆడవాళ్లు అడుగుతున్నారు గానీ ఒకప్పుడు ఈ వాటాలు, మొహమాటాలు ఎందుకొచ్చిందని మహిళలు పెద్దలు మాటలకు కట్టుబడి ఉండేవారు. అలా ఇప్పటికీ సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి జీవించే వారు ఉన్నారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు. తిప్పాయపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని సంజీవరాయుడుగా కొలుస్తారు. అయితే ఈ ఆలయంలోకి మగవాళ్ళు మాత్రమే వెళ్తారు. అంతేకాదు ఆడవారు చేయాల్సిన పనులు కూడా మగవారే చేస్తారు. ఎందుకూ అంటే అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడూ వినని వాళ్ళకి వింత ఆచారం.
సాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే దేవుడికి నైవేద్యం అనేది మహిళలే కదా వండుతారు. కానీ ఈ తిప్పాయపల్లిలో మాత్రం మగాళ్లు వాడుతారు. పొంగళ్ళు స్వయంగా మగాళ్లే వండి.. సంజీవరాయుని ఆలయానికి తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పిస్తారు. గుడి దగ్గరే పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయుని ఆలయ సన్నిధిలో ఇలా చేస్తారు. తిప్పాయపల్లితో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లోని మగాళ్లంతా పొంగళ్ళు వండేందుకు కావాల్సిన బియ్యం, బెల్లం, ఇతర వంట సరుకులను కొత్త గంపలో పెట్టుకుని ఆలయానికి వస్తారు. సంక్రాంతి పండుగ కంటే కూడా ఈ పొంగళ్ళు పండగకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పంటలు బాగా పండి, పశు సంపద బాగా పెరిగి గ్రామం కళకళలాడాలని పొంగళ్ల వేడుక నిర్వహిస్తారు.
సంజీవరాయ స్వామికి పొంగళ్ళు మగాళ్లు మాత్రమే పెట్టాలని ఆలయ శాసనాల్లో ఉందని.. అనాదిగా వస్తున్న ఆచారం అని గ్రామస్తులు చెబుతారు. ఈ పొంగళ్ల పండుగకు ఆ ఊరి ప్రజలు దేశంలో ఏ మూలన ఉన్నా ఊరికి చేరుకొని స్వామి వారికి పొంగళ్ళు చెల్లించి మొక్కు తీర్చుకుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయంలోకి కేవలం మగవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆడవారికి ప్రవేశం ఉండదు. ఒకవేళ స్వామి వారిని దర్శించాలని అనుకుంటే ఆలయం బయట నుంచే స్వామి వారికి దండం పెట్టుకోవాల్సి ఉంటుంది. స్వామి వారికి సమర్పించిన నైవేద్యాన్ని కూడా ఆడవాళ్లు తాకరు. పొంగళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత మగాళ్లు.. 101 నీళ్ల బిందెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గంపల కొద్దీ బెల్లం, కొబ్బరి గిన్నెలు స్వామి వారికి కానుకలుగా సమర్పిస్తారు.
తమ కోరికలు నెరవేరిన వాళ్ళు స్వామి వారికి వేల రూపాయల్లో కానుకగా వేస్తారు. అదండి విషయం.. తిప్పాయపల్లిలో ఉన్న సంజీవరాయుడిని మగవాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా పూజలు చేసి.. స్వయంగా వండి నైవేద్యం పెడతారు. వంట వండడం, నైవేద్యం పెట్టడం, అభిషేకం చేయడం ఇవన్నీ లేడీస్ జాబ్ అని అనుకోకుండా.. మాకూ భక్తి ఉంది, మేము వంటల్లో చేయి తిరిగిన వాళ్ళమే, మా స్వహస్తాలతో చేసిన నైవేద్యాన్ని మా స్వాములోరికి మేమే స్వయంగా సమర్పిస్తామని మగాళ్లు ఒక శాసనం చేసుకున్నారు. ఈ ఆచారం గురించి తెలిసినవాళ్ళు.. మా మగాళ్లకు ప్రత్యేకంగా ఒక దేవుడు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఊరి వారి ఆచారంపై మీ అభిప్రాయమేమిటి? కేవలం మగవాళ్ళు మాత్రమే ఇలా పొంగళ్ల పండుగ చేసుకోవడం ఏంటి? ఇలా చేసుకోవడానికి మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.