హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజించే దైవస్వరూపాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది. సాధారణంగా ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరమే గుర్తొస్తుంది. అందరు దేవుళ్లకు పసుపు, కుంకుమలు పెట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతుంటారు. అలా ఎందుకు పెడతారో తెలుసుకోవాలంటే ఓసారి రామాయణం వైపు చూడాల్సిందే.
అసలు ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకంత ఇష్టం? దానికి వెనుక గల కారణాలేమిటి? ఇప్పుడు చూద్దాం.
రామ – రావణ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆ సమయంలో రావణాసురుడు సంధించిన బాణాలు ఆంజనేయునికి తగిలి ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. అయినాసరే ఏమాత్రం చలించకుండా ధృడ దీక్షతో నిలబడి యుద్ధాన్ని ముందుకు నడిపాడట.
యుద్ధం ముగిసేసరికి ఆంజనేయుని దేహం పూచిన మోదుగ చెట్టులా మారిందని వాల్మీకి మహర్షి రామాయాణంలో వర్ణించాడు. శ్రీరాముడు తనకోసం రక్తమోడిన ఆంజనేయుడిని చూసి ఎంతగానో మెచ్చి.. ఆ రంగులో ఉన్న సింధూరాన్ని ఆంజనేయుని మేనికి పూస్తే ఆనాటి సంఘటన గుర్తొచ్చి ఆనందంతో పరవశించిపోతానని చెప్పాడట.
ఆ కారణంగానే ఆంజనేయ స్వామి సింధూరం అంటే ఇష్టపడతాడని చెబుతుంటారు. అదీగాక రక్తం రంగు పరాక్రమం, త్యాగం, పవిత్రతలకు ప్రతీతి. అందుకే స్వామికి సింధూరాన్ని బొట్టుగా పెడతారని హిందువులు నమ్ముతుంటారు. అందువల్ల ఆంజనేయ స్వామికి ఎవరు పూజ చేసినా సింధూర తిలకాన్ని ఖచ్చితంగా పెడతారు. భక్తులు కూడా నుదిటన సింధూరాన్నిపెట్టుకుంటారు. ఆంజనేయ స్వామిని తలచుకుంటే భయం, బాధ తొలగిపోతాయని చరిత్ర చెబుతోంది.