దేవాలయాలకు వెళ్లే వారు భగవంతుడి దర్శనం తర్వాత కాసేపు గుడి పరిసరాల్లో కూర్చోవడం పరిపాటి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో దాదాపుగా ప్రతి ఊరులోనూ ఒక ఆలయం ఉంటుంది. ఈ గుళ్లకు తోడు గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉంటాయి. ప్రజలు తమ నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నా దైవారాధనకు కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు. పొద్దున స్నానపానాదులు ముగించుకోగానే దేవుడి ఫొటోకు దండం పెట్టడం చాలా మందికి అలవాటు. స్త్రీలు తులసి చెట్టుకు పూజలు చేస్తుంటారు. ఇక, వారంలో ఒక రోజు ఆలయానికి వెళ్లడం చాలా మందికో హాబీ. గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి, దేవుడ్ని దర్శించుకుంటే ఎంతో ప్రశాంతతను ఫీలవుతారు. ఆలయాలకు వెళ్లే భక్తులు భగవంతుడి దర్శనం తర్వాత పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. అలాగే మరికొంత మంది భక్తులు మొక్కలు కూడా చెల్లించుకుంటారు. అయితే భక్తులు దర్శనం తర్వాత గుడి పరిసరాల్లో కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం కూడా పరిపాటిగా వస్తోంది. పూజారులు ఇచ్చే ప్రసాదాలను ఆరగిస్తూ కొద్దిసేపు అక్కడే గడుపుతారు.
దేవుడి దర్శనం అనంతరం ఆలయంలో కాసేపు కూర్చోవడం చాలా ఏళ్లుగా వస్తోంది. ఇలా కూర్చోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు అంటున్నారు. భగవంతుడి దర్శనంతో మనసు, శరీరం ఉత్తేజితం అవుతాయి. అర్చకస్వాములు చేసే మంత్రోచ్ఛారణతో పాటు ఆలయాల నిర్మాణశైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. గుడి పరిసరాల్లో విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ లభ్యమయ్యే చోటే ఆలయాలను నిర్మిస్తారని అంటున్నారు. ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూలవిరాట్ను ప్రతిష్ట చేస్తారట. అందుకే దేవుడి దర్శనం తర్వాత ఆలయంలో కూర్చుంటే చికాకులు దూరమై భక్తుల మనసుకు సాంత్వన, ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు. చెడు ఆలోచనలు తొలగి మంచి మార్గంలో ప్రయాణించేందుకు ఇది చాలా ఉపయోగడపడుతుందని సూచిస్తున్నారు.