మకర సంక్రాంతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి పిల్లాపెద్ద అంతా స్వగ్రామాలకు చేరుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లలతో కళకళాడుతున్నాయి. మూడ్రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అని అందరికీ తెలిసిందే. మొదటిరోజు భోగి మంటలు వేసుకుని తలార స్నానం చేసి సూర్యభగవానుడిని పూజిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు.
ఇక ముఖ్యమైనది రెండో రోజు జరుపుకునే మకర సంక్రాంతి. ఈ రోజు పిల్లాజెల్లా అంతా కలిసి పూజ చేసుకున్న తర్వాత సరదాగా గాలిపటాలు ఎగురవేస్తారు. సంక్రాంతి అంటే గాలిపటాలు ఉండాల్సిందే. అలా కుటుంబం అంతా కలిసి పిండివంటలు తింటూ గాలి పటాలు ఎగురవేస్తారు. సిటీల్లో అయితే డాబాలు, అపార్టుమెంట్ల మీద గాలి పాటాలు ఎగురవేస్తే.. పల్లెల్లో అయితే పొలాలు, పచ్చికబైళ్లు, చెరువు కట్టల మీద ఈ గాలి పటాలను ఎగురవేస్తుంటారు. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో అయితే కైట్ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తుంటారు.
అయితే చాలామందికి ఈ గాలిపటాలు సంక్రాంతికి ఎందుకు ఎగురవేస్తారు అనేది తెలియదు. ఏదో సరదాకి గాలిపటాలు ఎగేరేస్తామని అనుకుంటారు. మన తాతలు, తండ్రులు, అన్నలు చెప్పారు కాబట్టి సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసి సరదాగా గడుపుతున్నాం అని చెబుతారు. సంక్రాంతికే ఎందుకు ఎగరేస్తారు అనడానికి దీని వెనుక శాస్త్రీయ, పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటే తెలుసుకుందాం. మీరు తెలియని వాళ్లకు కూడా ఈ విషయాలను తెలియజెప్పండి.
పౌరాణికంగా ఉన్న కారణం ఏంటంటే.. పురాణాల ప్రకారం శ్రీరాముడు గాలిపటాన్ని ఎగురవేశారంట. రాముడు ఎగరేసిన గాలిపటం ఇంద్ర లోకానికి చేరుకుందంట. అందుకే పురాణాల ప్రకారం గాలిపటం ఎగరేయాలని చెబుతుంటారు. అలాగే దీని వెనుక శాస్త్రీయంగా కూడా మరో కారణం ఉంది. అదేంటంటే.. సంక్రాంతి అనేది చలికాలంలో వస్తుంది. ఇలాంటి సమయంలో శరీరానికి సూర్యరశ్మి, ఒంటికి వ్యాయామం కావాలి. అలాగే పొద్దున్నే ఎండలో గాలిపటం ఎగరేస్తే శరీరానికి విటమిన్ డీ కూడా వస్తుంది.
అందుకే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల పురాణాల ప్రకారం నడుచుకున్నట్లు ఉంటుంది.. శరీరానికి కావాల్సిన వేడి, ఇమ్యూనిటీ లభిస్తుంది. ముఖ్యంగా మీకు సంక్రాంతి సెలవుల్లో టైమ్ పాస్ కూడా బాగా అవుతుంది. పిల్లా పెద్దా అంతా కలిసి సరదాగా గడిపేందుకు గాలిపటాల ఆట బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి గాలిపటాలు కొనుక్కొచ్చి అంతా కలిసి ఎగరేయండి. ఈ పండగని హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయండి.