హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. సూరత్ కు చెందిన సమీరా బాను కేసుకి సంబంధించి విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భర్త నుంచి విడిపోయిన సుమేరా.. ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకుని హైదరాబాద్ లో ఉగ్ర కార్యకలాపాలు ప్లాన్ చేసింది. అందుకోసం ఒక వ్యాపారికి వల వేసింది.
హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సుమేరా బాను కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పాతబస్తీ వేదికగా ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సూరత్ కు చెందిన సుమేరా బానుని ఇటీవల ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా ప్రేరణ పొందిన సుమేరా బాను.. ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావీన్సీలో చేరింది. అబు హంజాలా అనే ఉగ్రవాది విదేశాల నుంచి సుమేరా బానుకి హ్యాండ్లర్ గా ఉన్నాడు.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరపాలని పథకం వేసినట్లు విచారణలో బయట పడింది. ఇందుకోసం హైదరాబాద్ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మెడికల్ షాప్ యజమానితో కాంటాక్ట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా ఆ షాపు యజమానితో పరిచయం చేసుకుని.. హైదరాబాద్ లో తనకు ఒక ఉద్యోగం ఇప్పించమని కోరినట్లు విచారణలో వెల్లడైంది. వ్యాపారితో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఏటీఎస్ అధికారులు మంగళవారం హైదరాబాద్ చేరుకొని కాలాపత్తర్ లో ఉన్న వ్యాపారి ఇంటికి వెళ్లి సుమేరా కేసులో సాక్షిగా అతని వాంగ్మూలం తీసుకున్నారు. భర్త నుంచి 2021లో విడిపోయిన సుమేరా బాను.. ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలయ్యింది.
దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించిన సుమేరా.. హైదరాబాద్ లో కూడా నడిపించాలని ప్రయత్నం చేసింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమేరా ప్లాన్స్ ఏంటి? హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకుంది? ఇక్కడకు వచ్చేందుకు ఎవరితో అయినా సంప్రదింపులు జరిపిందా? ఈ ఉగ్రవాదంలోకి ఇంకెవరినైనా లాగే ప్రయత్నం చేసిందా? అనే విషయాలను గుజరాత్ నిఘా వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎస్ అధికారుల కస్టడీలో ఉన్న సుమేరాను విచారించేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లనుంది. ఉగ్ర సంబంధాలపై ఆమెను ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ వేదికగా బయటపడుతున్న ఉగ్ర లింకులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు.
ఇక ఈమెతో సంబంధం కలిగిన పాతబస్తీకి చెందిన ఫసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉగ్రవాదులతో లింకులు ఉన్న తండ్రీ, కూతుర్లను మంగళవారం రాత్రి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ జావీద్, ఖతీజాలను రామగుండంలో అదుపులోకి తీసుకున్నారు. టోలీచౌకికి చెందిన జావీద్ అమీర్ పేట్ లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఈ ఇద్దరూ హైదరాబాద్ లో ఐఎస్కేపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలిసింది. అమీర్ పేట్ లో ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ పేరుతో యువతకు ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. దీంతో అమీర్ పేట్ లోని పలు కోచింగ్ సెంటర్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.