చిత్తూరు జిల్లా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మోసానికి బలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుహాసిని అరెస్ట్‌తో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కొందరు బాధితులు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20 – 30 మంది వరకు ఉన్నట్టు భావిస్తున్నారు.
తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని, ఒంటరిదానినని యువకులకు వల వేస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మకంగా నటిస్తుంది. పెళ్లిచేసుకున్నాక దోచుకొని ఊడాయిస్తుంది. విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోని మార్కెట్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని ఆమె అతనికి చేరువైంది. అనంతరం సునీల్ తన తల్లిదండ్రుల్ని ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు.
వివాహ సమయంలో అత్తమామలు ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు. కొద్దిరోజుల తర్వాత ఆమె తనని చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షల రూపాయలు తీసుకుంది. డబ్బు విషయమై భర్త ఆమెను నిలదీయగా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై భర్త అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సునీల్ తన గురించి ఆరా తీస్తున్నాడని తెలుసుకున్న సుహాసిని అతనికి ఫోన్ చేసి తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయినట్లు చెప్పింది. అవాక్కైన అతను ఈ విషయాన్ని పోలీసులతోపాటు మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మహిళ బాధితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొదటి భర్త సహకారంతోనే ఈ తరహా మోసాలకు సదరు మహిళ పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంకా ముందు ముందు ఎంతమంది బయటికి వచ్చి ఆమె మోసాలు తెలియజేస్తారో చూడాలి.