విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్…
సాఫ్ట్‌వేర్ జాబ్‌కి పేకప్ ..
భక్తులకు మాయమాటలతో టోపీ…
బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!.
‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ కుటీరంలో పూజలు నిర్వహిస్తుంటారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను మాత్రమే పూజలో కూర్చోబెట్టేవాడు. ఆ సమయంలో పైకప్పు రెండుగా విచ్చుకునేలా ఏర్పాటుచేశాడు. తన మహిమ వల్లే అలా జరిగిందని నమ్మించేవాడు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామస్థులు కొందరు అతడికి భక్తులుగా మారారు. విశ్వచైతన్యను బాబాగా కొలవడం మొదలెట్టారు. అతడు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గ్రామంలో పదెకరాల స్థలాన్ని అందజేశారు. యూట్యూబ్ చానల్ పెట్టి దాని ద్వారా ప్రవచనాలు చెబుతూ ప్రచారం చేసుకునేవాడు. ప్రజల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తీరుస్తానంటూ నమ్మబలకడంతో భక్తులు పెరిగారు. ఆదాయమూ పెరిగింది.
నమ్మిన వాళ్లను బురిడీ కొట్టిస్తూ కోట్లు వెనకేశాడు. ఆశ్రమ ప్రాంగణంలోనే ఓ విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నాడు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ బురిడీ బాబా దర్శనం కోసం వచ్చేవారు. హోమాలు చేయించి, ప్రవచనాలు చెబుతూ తాయత్తులు కట్టి భక్తులను నమ్మించేవాడు. వారి నుంచి లక్షలు వసూలు చేసేవాడు. ఆరోగ్య సమస్యలు తొలగిస్తానని చెప్పి విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.92 లక్షలు కాజేశాడు. ఆమె అనారోగ్యం మాత్రం ఎంతకూ నయం కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ నల్లగొండ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు రంగంలోకి దిగి జూలై 30న విశ్వచైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆశ్రమంలో తనిఖీలు చేసి రూ.26 లక్షల నగదు, 25 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.