కొంతమంది పెట్రోల్ బంకు సిబ్బంది కస్టమర్లను మోసం చేస్తుంటారు. రకరకాల ట్రిక్కులను ప్లే చేసి మోసాలకు పాల్పడుతుంటారు. అసలు పెట్రోల్ పంపుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయంటే?
పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు కొంతమంది చేసే మోసాలను గుర్తించకపోతే మోసపోయే ఛాన్స్ ఉంది. దీని వల్ల చాలా నష్టపోతారు. పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు మీటర్ ని జీరోకి సెట్ చేయకపోవడం, దృష్టి మరల్చి మోసం చేయడం వంటివి చేస్తుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో ఇలా జరుగుతుందని చెప్పలేము కానీ కొంతమంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ మోసాలను ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడితే మంచిది. ముఖ్యంగా పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఫోన్ లో మాట్లాడకుండా ఉండడం మంచిది. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. అసలు పెట్రోల్ పంపుల్లో ఎలాంటి మోసాలు చేస్తారో చూడండి.
మీ దృష్టి మరల్చి చేసి తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ కొడతారు. ఉదాహరణకు మీరు రూ. 500 పెట్రోల్ కొట్టమని అడిగారు. పెట్రోల్ పోసే వ్యక్తి అంతకు ముందే మరొక వ్యక్తికి రూ. 100 పెట్రోల్ కొట్టాడు. మీటర్ ని సున్నాకి రీసెట్ చేస్తున్నట్టు షో చేస్తాడు. ఈలోపు అదే బంకులో పని చేసే మరో వ్యక్తి మిమ్మల్ని క్యాష్ ఆ? కార్డ్ ఆ సార్ అంటూ దృష్టి మరలుస్తాడు. మీరు అతని వైపు చూసేలోపు ఈ పెట్రోల్ కొట్టే వ్యక్తి జీరోకి రీసెట్ చేసినట్టు కవర్ చేస్తారు. కానీ ఆ వ్యక్తి అంతకు ముందు మరో వ్యక్తికి కొట్టిన రూ. 100 మీటర్ నుంచే పెట్రోల్ కొడతాడు. రూ. 500 వరకూ పెట్రోల్ కొడతాడు. మీ దృష్టిలో బంకు సిబ్బంది రూ. 500 పెట్రోల్ కొట్టినట్టు.. కానీ నిజానికి మీ బండిలో ఫిల్ చేసింది రూ. 400 పెట్రోలే. అంటే మీకు రూ. 100 నష్టం. మీటర్ జీరో వద్ద రీసెట్ చేసి ఉంటే వేరే ట్రిక్ ప్లే చేస్తాడు.
అదేంటంటే మీరు రూ. 500 పెట్రోల్ అడుగుతారు. కానీ అతను రూ. 100 పెట్రోల్ కొడతాడు. అది చూసిన మీరు.. ‘నేను అడిగింది 500 కదా’ అని అంటారు. దానికి అతను మీరు వందే కొట్టమన్నారనో లేక సరిగా వినిపించలేదనో కారణం చెబుతాడు. సరే సార్ ఆల్రెడీ రూ. 100 కొట్టాను కదా, ఇంకో రూ. 400 కొడుతున్నా అని అంటాడు. జీరోకి రీసెట్ చేస్తున్నట్టు కవర్ చేస్తుంటాడు. ఈలోపు వేరే బంకు సిబ్బంది వచ్చి క్యాష్ ఆ? కార్డా సార్ అని అడుగుతాడు. జీరోకి రీసెట్ చేసాడేమో అని అనుకుంటాం. ముందు రూ. 100 కొట్టాడు కదా.. ఇప్పుడు రూ. 400 కొడితే రూ. 500 పెట్రోల్ కొట్టించినట్టే అవుతుంది అని అనుకుంటాం. కానీ బంకు సిబ్బంది కొట్టింది రూ. 400 పెట్రోలే. మొదటగా రూ. 100 కొట్టాడు. తర్వాత జీరోకి రీసెట్ చేయకుండా రూ. 300 కొట్టాడు. ఇలా రూ. 500 పెట్రోల్ పోయాల్సింది రూ. 400 పెట్రోలే పోస్తారు.
పెట్రోల్ పంపు మెషీన్స్ లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ చిప్ వల్ల మీరు కొట్టించే పెట్రోల్ లో 3% తక్కువ ఆయిల్ వెళ్లేలా చేస్తుంది. మీటర్ రీడింగ్ లో మాత్రం ఫుల్ అమౌంట్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు రూ. 1000 పెట్రోల్ అడిగితే.. మీకు రూ. 970 మాత్రమే వస్తుంది. మీటర్ లో మాత్రం రూ. 1000 అమౌంట్ కనబడుతుంది. అనుమానం వచ్చినప్పుడు లేదా అప్పుడప్పుడు లీటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టమని చెప్పాలి. అప్పుడు మోసం చేస్తున్నాడో లేదో తెలిసిపోతుంది.
ఇది ఖచ్చితంగా మోసం అని చెప్పలేము కానీ అనైతికమైన చర్య. కొన్ని పెట్రోల్ పంపుల్లో ఇలా చేస్తున్నారు. పెట్రోల్ లో రెండు రకాలు ఉంటున్నాయి. బంకుకి వెళ్ళినప్పుడు కొందరు సిబ్బంది.. పవర్ ఆయిల్ కొట్టమంటారా? సాధారణ ఆయిల్ కొట్టమంటారా? అని అడుగుతారు. సాధారణ ఆయిల్ తో పోలిస్తే పవర్ ఆయిల్ ధర ఎక్కువ. మైలేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్తారు. కానీ కొంతమంది బంకు సిబ్బంది కస్టమర్ ని అడక్కుండా ఖరీదైన ఆయిల్ ఫిల్ చేస్తున్నారు. దీని వల్ల సాధారణ పెట్రోల్ తో పోలిస్తే 5 నుంచి 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్ విషయంలోనూ ఇంతే. కొంతమంది పెట్రోల్ పంపు ఓనర్లు సిబ్బందిని ఇలా ట్రైన్ చేస్తున్నారు.
ఇది అతి పెద్ద మోసం. కారు వాడేవారు చాలా మంది పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించడానికి వచ్చినప్పుడు కారు దిగరు. ఎందుకంటే పెట్రోల్ పంపుల మీద నమ్మకం. అయితే కొంతమంది పెట్రోల్ పంపు సిబ్బంది ఇదే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టమని అడిగినప్పుడు సిబ్బంది జీరోకి రీసెట్ చేసి మీటర్ ని చూపిస్తాడు. మీ కారు ఫ్యూయల్ ట్యాంక్ కి, కారు ఎడమ పక్కన అద్దానికి మధ్యలోకి వస్తాడు. ఆయిల్ ఫిల్ చేస్తుండగా రూ. 200 దగ్గర, రూ. 300, రూ. 500 దగ్గర లేదా వేరే అమౌంట్ దగ్గర ఆపి.. 2 నిమిషాల్లో వస్తాను సార్ అనో, స్వైపింగ్ మెషిన్ తీసుకొస్తాననో లేక వేరే ఏదో కారణమో చెబుతాడు. తర్వాత వచ్చి ఎక్కడైతే ఆపాడో అక్కడ నుంచి ఆయిల్ ఫిల్ చేయడం మొదలుపెడతాడు. అంతా సవ్యంగానే జరుగుతుందని అనుకుంటారు. కానీ సిబ్బంది ఫిల్ చేసింది మీ కారులో కాదు. వేరే వాహనంలో. ఇందులో వేరే సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సైడ్ మిర్రర్ లోంచి చూద్దామంటే సిబ్బంది అడ్డుగా ఉంటాడు. వేరే కారులో ఫిల్ చేసిన ఆయిల్ ని మీ కారులో నింపినట్టు కవర్ చేస్తాడు. కారులో పాటలు వినడమో, ఫోన్ లో మాట్లాడడమో, ఫ్రెండ్ తో మాట్లాడడమో చేస్తూ కారులో ఉన్న ఫ్యూయల్ ముల్లు పైకి వచ్చిందా? లేదా అన్న సంగతి గమనించరు. దీని వల్ల చాలా నష్టపోతారు.
ఆయిల్ డిస్పెన్సర్ నాజిల్ ని కొన్ని సార్లు సిబ్బంది లాక్ చేయరు. లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఫ్యూయల్ అనేది ఎంత నంబర్ ఎంటర్ చేస్తే అంత అమౌంట్ ఫిల్ అవుతుంది. కానీ ఫ్యూయల్ ట్యాంక్ లో డిస్పెన్సర్ నాజిల్ ని పెట్టి అదే పనిగా మేన్యువల్ గా ఆపరేట్ చేయడం వల్ల ఆయిల్ అనేది కొంత లాస్ అవుతుంది. సిబ్బంది కంటిన్యూగా ఆపడం, మళ్ళీ స్టార్ట్ చేయడం చేస్తా ఉంటాడు. దీని వల్ల ఎయిర్ లాక్ అనేది ఏర్పడి కొంత ఆయిల్ అనేది ఆయిల్ డిస్పెన్సింగ్ మెషిన్ లో ఉండిపోతుంది. ఇలా చేయడం వల్ల 10 లీటర్ల ఆయిల్ మీద 200 మి.లీ. ఆయిల్ పొదుపు అవుతుందని స్టడీస్ చెబుతున్నాయి. ఉదాహరణకు మీ వాహనం యొక్క ట్యాంక్ సైజుని బట్టి మీరు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే.. 500 నుంచి 750 మి.లీ. ఆయిల్ అనేది నష్టపోతారు. డిస్పెన్సర్ నాజిల్ అనేది పొడవుగా ఉన్నా కూడా కొంత ఆయిల్ అనేది నాజిల్ లో ఉండిపోతుంది.
మీరు కొంత అమౌంట్ పెట్రోల్ కొట్టమని చెబుతారు. సిబ్బంది మీటర్ ని జీరోకి రీసెట్ చేసి పెట్రోల్ కొడతాడు. అయితే ఆఖరున కొంత పెట్రోల్ కొట్టాల్సి ఉందనగా.. మీ దృష్టి మరల్చి మీటర్ ని మీరు ఎంత అయితే పెట్రోల్ కొట్టమన్నారో అంత అమౌంట్ కి మళ్ళీ రీసెట్ చేస్తారు. ఇలా చేసినప్పుడు లీటర్ల సంఖ్య అనేది మారదు. ఉదాహరణకు మీరు రూ. 2 వేలు పెట్రోల్ కొట్టమని అడిగారు. సిబ్బంది రూ. 1700 వరకూ పెట్రోల్ కొడతాడు. ఆ తర్వాత వేరే సిబ్బంది మీ దృష్టి మరల్చుతాడు. ఆ సమయంలో పెట్రోల్ కొట్టే సిబ్బంది మీటర్ ని రూ. 2 వేలకి రీసెట్ చేస్తాడు. ఈ సమయంలో అమౌంట్ ని చూస్తామే తప్ప ఎన్ని లీటర్లు ఫిల్ అయ్యింది అనేది చూడరు. దీని వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఎన్ని లీటర్లు ఫిల్ చేశారో, ఎంత అయ్యిందో అనేది కరెక్టుగా లెక్కించుకోవాలి. రిసీప్ట్ అడిగితే వీరి చేసిన తప్పు బయటపడుతుంది. కానీ రిసీప్ట్ ప్రింట్ అవ్వడం లేదని అబద్ధం చెబుతారు.