కొన్ని అప్లికేషన్ లను ఇన్ స్టాల్ చేస్తే ఫోన్లు హ్యాంగ్ అయిపోవడం, డేటా చోరీకి గురవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఒక యాప్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. ఆ యాప్ ఇన్ స్టాల్ చేస్తే క్షణాల్లో ఖాతాలో డబ్బులు మాయమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్ ఏంటంటే?
చాలా మందికి వాట్సాప్, టెలిగ్రామ్ లలో కొన్ని లింక్ లు వస్తుంటాయి. ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోండి అని ఆ లింక్ సారాంశం. చూడ్డానికి ప్రముఖ కంపెనీలు, సంస్థల యాప్ లలాగా అనిపిస్తాయి కానీ ఇన్ స్టాల్ చేస్తే కనుక బ్యాంకులో డబ్బులు క్షణాల్లో మాయమైపోతాయి. అందుకే కొన్ని యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజాగా రైల్వేస్ కి సంబంధించిన యాప్ ఒకటి బాగా సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో చక్కెర్లు కొడుతోంది. ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వారి ఖాతాల నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. ఆ యాప్ ను అస్సలు ఇన్ స్టాల్ చేసుకోవద్దని ఐఆర్సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ యాప్ ఏంటంటే?
ఐఆర్సీటీసీ కనెక్ట్.ఏపీకే (irctcconnect.apk) అనే యాప్ ను డౌన్ లోడ్ చేయవద్దని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్ ఫార్మ్ ల ద్వారా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయమని పంపిస్తున్నారని.. ఇదొక హానికరమైన అప్లికేషన్ అని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేస్తే మీ ఫోన్ కు హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ వెనుక ఉన్న ఉద్దేశం వేరని.. యాప్ నిర్వాహకులు ఐఆర్సీటీసీ వాళ్ళలా నటిస్తూ.. యూపీఐ వివరాలు, నెట్ బ్యాంకింగ్ వివరాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రయత్నం చేస్తారని హెచ్చరించింది.
ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయకుండా ఉండాలని, ఇలాంటి అనుమానాస్పద యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. ఐఆర్సీటీసీ నిర్వాహకుల పేరుతో మోసాలు చేసే మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఐఆర్సీటీసీ యొక్క అధికారిక ‘IRCTC రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్ ని మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరింది. అలానే ఐఆర్సీటీసీ వినియోగదారులకు కాల్ చేసి.. పిన్, ఓటీపీ, పాస్వర్డ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూపీఐ వివరాలను అడగదని, అందరూ దయచేసి గమనించాలని రిక్వస్ట్ చేసింది.