దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరు చేసే తప్పుకు ఎంతో మంది బలి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అంటున్నారు అధికారులు.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లా పాడేరు ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
అల్లూరి జిల్లా పాడేరు వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంట్లమామిడి సమీపంలో ఘాట్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో భార్యాభర్తలు ఉన్నారు. కిలగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు.. విశాఖపట్నంలో ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్ లో అడిషినల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామం అయిన కిలగాడలో మంగళవారం గంగమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన భార్య చండా మహేశ్వరితో కలిసి వచ్చారు. వీరితో పాటు బావమరిది సమరెడ్డి పూర్ణారావు, డ్రైవర్ ఉన్నారు. ఉత్సవాలు ముగించుకొని బుధవారం సాయంత్రం కారులో విశాఖపట్నం బయలు దేరారు.
పాడేరు ఘాట్ లో మలుపు వద్ద కారు అదుపు తప్పి సుమారు 50 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఉమా మహేశ్వరరావు, చెండా మహేశ్వరి స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ సుబ్బరావు, సమరెడ్డి పుర్ణారావులను హుటాహుటిన అంబులెన్స్ లో పాడేరు జిల్లా హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ సుబ్బారావు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, చనిపోయిన కారు డ్రైవర్ విశాఖ కంచెరపాలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.