అన్నదాతలకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తి బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన 28 నెలల్లో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామన్నారు. వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్ వ్యవసాయ స్టార్టప్‌లను పెంచుతుందని.. ఇది రైతులకు మేలు చేస్తుంది అన్నారు. పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతాం అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు.
అలానే రానున్న మూడేళ్లలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్ పుట్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం సూక్ష్మ ఎరువులపై దృష్టి సారిస్తామన్నారు. ఇక ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిల్లెట్ల అవసరంపై అవగాహన కల్పించడం, చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యం. దీనికి అనుగుణంగా కేంద్రం బడ్జెట్‌లో శ్రీఅన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులకు సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
త్వరలోనే భారత్ తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాక.. ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అలానే హైదరాబాద్‌లో ఉన్న మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని సీతారామన్ స్పష్టంచేశారు. అలానే పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు.