ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ICICI… తమ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైపోయింది. ఫిబ్రవరి 10 నుంచి కొన్ని ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించి ATM నుంచి డబ్బు విత్ డ్రా చేసినా.. క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించినా ఛార్జీల మోత తప్పదంటున్నారు. ఇప్పటికే అదే విషయమై తమ ఖాతాదారులకు సమాచారమిచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మరి, ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయో చూడండి.
ఏదైనా అత్యవసర పరిస్థితిలో ICICI క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బు విత్ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదు. ఇప్పటికే చాలా బ్యాంకులు, క్రెడిట్ కార్డు ప్రొవైడర్లు ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అది కూడా చిన్న మొత్తం ఏమీ కాదు.. ఏ రకమైన కార్డు అయినా విత్ డ్రా చేసిన మొత్తంపై 2.5 శాతం ఛార్జీలు వసూలు చేస్తామంది. మినిమం రూ.500 ఛార్జీలు ఉంటాయని తెలిపారు. చెక్ రిటర్న్, ఆటో డెబిట్ ఫెయిల్ అయిన సందర్భాల్లోనూ ఛార్జీలను సవరించారు. అలాంటి సందర్భాల్లో 2 శాతం ఛార్జీలు, కనీసం రూ.500 వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇక నుంచి ICICI క్రెడిట్ కార్డు పేమెంట్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా.. డ్యూ డేట్ లోగా పేమెంట్ చేయకపోతే భారీగానే ఛార్జీలు వసూలు చేయనుంది. అందుకు సంబంధించిన ఛార్జీల వివరాలను వెల్లడించింది. డ్యూ అమౌంట్ రూ.100లోపు ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.100- 500 మధ్య ఉన్న పేమెంట్ కు రూ.100, 501-5000 మధ్య అయితే రూ.500, రూ.5001- 10000లలోపు అయితే రూ.750, రూ.10001-25 వేల వరకు అయితే రూ.900, రూ.50 వేల వరకు రూ.1000, రూ.50 వేలు దాటిన తర్వాత ఎంత అమౌంట్ అయినా కూడా రూ.1200 ఛార్జీల కింద వసూలు చేయనుంది. పైగా ఈ ఛార్జీలు అన్నింటికి అదనంగా GST కూడా కట్టాల్సి ఉంటుంది. ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే ఈ లేట్ ఫీజ్ నుంచి మినహాంపు నిచ్చింది. సకాలంలో బిల్లు చెల్లిస్తే మాత్రం ఎంలాంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ICICI బ్యాంకు సవరించిన ఛార్జీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.