ఊరు వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేద్దామంటే డబ్బులు పూర్తిగా రావు. బస్ ఆపరేటర్లు ఛార్జీలు విధిస్తారు. విమానం టికెట్ కొన్నా ఇదే పరిస్థితి. అయితే ఇక నుంచి ఆ బాధలు ఉండవు. ఇలా చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసినా మీ డబ్బు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
ఫలానా తేదీన ప్రయాణం చేయాలని బస్సు టికెట్లు బుక్ చేసుకోవడమో, రైలు టికెట్లో, ఫ్లైట్ టికెట్లో బుక్ చేసుకోవడమో చేస్తారు. ఐతే సరిగ్గా ప్రయాణం తేదీన ఏదో ఒక పని పడుతుంది. దీంతో అప్పటికప్పుడు టికెట్ క్యాన్సిల్ చేయాలంటే సమయాన్ని బట్టి రీఫండ్ వస్తుంది. కొన్నిసార్లు సగం వస్తే.. కొన్నిసార్లు సగం డబ్బులు కూడా రావు. దీంతో డబ్బు వృధా అయిపోతుంది. ఈరోజుల్లో బస్ టికెట్ అంటే తక్కువేం కాదుగా. స్లీపర్ బస్సులో వెళ్లాలంటే దూరాన్ని బట్టి 1500 నుంచి 2 వేలు ఆపై ఉంటుంది. ఇక విమానం అయితే 4 వేల నుంచి ఉంటుంది టికెట్ ధర. టికెట్ బుక్ చేసుకుని తీరా బయలుదేరే సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వస్తే డబ్బుల మీద ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఉండబోదని పేటీఎం ప్రకటించింది.
కస్టమర్లకు పేటీఎం శుభవార్త చెప్పింది. టికెట్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎయిర్ లైన్స్, బస్ ఆపరేటర్లు ఛార్జీలు విధిస్తారు. అయితే క్యాన్సిల్ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ద్వారా ఈ ఛార్జీలు కూడా లేకుండా పూర్తిగా 100 శాతం టికెట్ డబ్బులను రీఫండ్ గా పొందవచ్చు. అయితే దీని కోసం కస్టమర్లు విమానం టికెట్ కొనే ముందు రూ. 149 విలువ చేసే క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే బస్ టికెట్ బుక్ చేసుకునే ముందు రూ. 25 క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. క్యాన్సిల్ ప్రొటెక్ట్ అంటే క్యాన్సిల్ అయిన టికెట్ డబ్బుకి రక్షణ ఉంటుందని అర్థం. ఈ క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఆప్షన్ తో కస్టమర్లు 100 శాతం టికెట్ డబ్బులు రీఫండ్ గా పొందవచ్చు.
అయితే విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక బస్సు టికెట్ ఐతే బస్ బయలుదేరడానికి 4 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే పూర్తిగా 100 శాతం రీఫండ్ వస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ తో రీఫండ్ అమౌంట్ పై ఎలాంటి పరిమితి ఉండదని, ఏ బ్యాంకు ఖాతా ద్వారా టికెట్ బుక్ చేశారో ఆ బ్యాంకు ఖాతాలోకే రీఫండ్ డబ్బులు జమ అవుతాయని పేటీఎం తెలిపింది. మరి బస్ టికెట్లు, విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకునేందుకు క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఆప్షన్ ని తీసుకురావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.