‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. అప్పుడే సీజన్ 6 గురించి కూడా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. సీజన్ 5 కంటెస్టెంట్లు మాత్రం బయట వారి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా విన్నర్ సన్నీ అందరికంటే ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే సన్నీ ఎంత ఫేమస్ అయ్యాడే అతని తల్లి కళావతి కూడా అంతే ఫేమస్ అయ్యారు. సన్నీకి వచ్చిన క్రేజ్ ఆవిడకు కూడా వచ్చింది. తన తల్లి అడిగిన మొదటి కోరికను నెరవేర్చేందుకే కప్పు కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు సన్నీ. చెప్పినట్లుగానే కప్పు కొట్టి కళావతిని ఖుషీ చేశాడు. ఇంతకాలం తల్లి గురించే గానీ తండ్రి గురించి మాట్లాడింది లేదు. సన్నీ మొదటిసారి తండ్రి గురించి ప్రస్తావించాడు. ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఇంతకాలం సన్నీ ఫ్యామిలీ విషయాల్లో అతని తండ్రి గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకున్నారు. తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడలేదే అని ప్రశ్నలు కూడా వినిపించాయి. అయితే అదే ప్రశ్న ఎదురవ్వగా సన్నీ దాట వేయకుండా అసలు నిజాలు అభిమానులతో పంచుకున్నాడు. సన్నీకి ఏడాది వయసున్న సమయంలో అతని తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి సన్నీ తల్లి కళావతి దగ్గరే పెరిగాడు.
భర్త గురించి అడిగిన సందర్భాల్లో కళావతి.. అతని గురించి నాకు తెలీదు. ఎక్కడున్నాడో, ఏమైయ్యాడో అనే సమాధానం వినిపించింది. సన్నీ కూడా దాదాపు అలాగే స్పందించాడు కానీ, అసలు విషయం చెప్పుకొచ్చాడు. ‘పర్సనల్ గా ఒక విషయం గురించి నేను మాట్లడాకూడదు అనుకున్నా. దాని గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భం ముందు ముందు రాకూడదని కోరుకుంటా. కొన్ని ఎలా జరుగుతాయో మనకి తెలీదు. అమ్మానాన్న వెరీ కూల్. వాళ్లు ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. నేను అమ్మ దగ్గరే పెరిగా. నాన్న అంటే కూడా రెస్పెక్ట్ ఉంది. ఎందుకు విడిపోయారు, ఏమైంది అని నేను ఎప్పుడూ అడగలేదు. అది వారి పర్సనల్ విషయం. కానీ, కళావతి నాకు మంచి ఫ్రెండ్, గాడ్ గిఫ్ట్’ అంటూ సన్నీ ఎమోషనల్ అయ్యాడు.