తెలుగు సినిమా రంగంలోకి ఒక అనామకుడిలా వచ్చి.. ఇంతింతై వటుడింతై అన్నట్లు.. తెలుగు ఇండస్ట్రీని రెండు దశాబ్దాలకు పైగా నంబర్ వన్ హీరోగా ఏలిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో తిరుగులేని స్టార్‌గా కొనసాగుతున్న సమయంలో 2009లో ప్రజలకు సేవ చేయాలని పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు చిరంజీవి. కానీ.. ఆశించిన ఫలితం రాకపోవడంతో.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. అన్నయ్య విఫలమైనా కూడా.. ఆయన సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టి, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులపై ప్రత్యర్థులు ఎలాంటి మాటల దాడి చేస్తారో అందరికి తెలిసిందే. కొన్ని సార్లు వ్యక్తిగత జీవితంపై కూడా దాడి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అది కొనసాగుతోంది. సినిమాల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా అభిమానించిన కొంతమంది నాయకులు.. ఇప్పుడు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో.. ఆయన వ్యక్తిగత జీవితంపై ఊహించని మాటల దాడి పరుష పదజాలంతో జరిగింది.
అయితే.. పవన్ కళ్యాణ్‌పై వచ్చే విమర్శలపై, జరిగే మాటల దాడిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ నాకొక కిడ్ బ్రదర్. నా బిడ్డలాంటి తమ్ముడు వాడు. వాడ్ని నా చేతులతో ఎత్తి పెంచాను. నేను, నా భార్య సురేఖ వాడికి తల్లిదండ్రుల లాంటి వాళ్లం. వాడికి కూడా మేమంటే అంతే ప్రేమ. అయితే.. ఇసుమంతైన స్వార్థం లేని వ్యక్తిని అన్నేసి మాటలు అంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పవన్‌కు డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు, నేను ఒక అన్నగా చెప్పడం లేదు. తనని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. అంతెందుకు.. మొన్నటి దాకా వాడికి సొంతిల్లు లేదు. మా అందరికీ ఉన్నాయి. నువ్వు కూడా కట్టుకో అంటే.. సరే చూద్దాంలే అని దాటేసేవాడు. వేళకు తినడు, బట్టలు సరిగ్గా వేసుకోడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్ని వదిలేసిన యోగిలాంటి వాడు పవన్.
అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి.. రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా.. ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్రొత్సహించాలి. అయితే మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్‌ను తిట్టిన వాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తోందే అని బాధగా ఉంటుంది.’ అని చిరంజీవి తన తమ్ముడు పవన్‌పై వచ్చే విమర్శలు తనను ఏ విధంగా బాధిస్తాయో వివరించారు. మరి చిరంజీవి స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.