అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు అత్త గారి హోదా వచ్చాక కోడలిని సాధిస్తుంటుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే. అత్త మీద కోపం అత్తయ్యాక కోడలి మీద చూపించే అత్తలు ఉన్న ఈ సమాజం ఆఫ్ ఇండియాలో.. కూతురిగా చూసుకునే అత్తగార్లు కూడా ఉంటారు. సారీ.. అత్త గార్లు కాదు, తల్లులే.
అలాంటి తల్లుల్లో వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఒకరు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురం సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి.. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా వైఎస్ జగన్ స్వస్థలం అయిన పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏట కూడా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, ఆయన మాతృమూర్తి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి.. చర్చి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
వైఎస్ భారతి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించగా.. విజయమ్మ భారతిని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. జగన్ కి కూడా విజయమ్మ ముద్దు పెట్టారు. కొడుకు కాబట్టి, ప్రతీ తల్లికి కొడుకంటే ప్రేమ సహజంగానే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అనిపించదు. కానీ కోడలి మీద సహజమైన ప్రేమ చూపించడం అంటే ప్రత్యేకమే మరి. పల్లెటూర్లలో తల్లులు.. పండగలప్పుడు కూతుర్లు సందడి చేస్తున్నప్పుడు ముద్దొస్తే.. ఇలానే దగ్గరకు తీసుకుని.. ‘నా తల్లే’ అంటూ ముద్దు పెట్టడం సహజం. అత్తగార్లు కూడా దాదాపు కోడళ్లను చూసి మురిసిపోతూ.. ముద్దు పెట్టుకుంటారు.
దీనికి కారణం.. ఒక కుటుంబం బాగుండాలంటే అది ఆడవారిలో ఉంటుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో అడుగుపెట్టే కోడలిలో ఉంటుంది. కోడలు ఉత్తమురాలు అయితే అత్తగారు గుణవంతురాలు అవుతుంది. తద్వారా ఇల్లు నిత్య సౌభాగ్యాలతో కళకళలాడుతుంది. అలా కోడలిని చూసి మురిసిపోతూ విజయమ్మ భారతికి ముద్దుపెట్టారు. తాను అత్తను కాదు, అమ్మని అనేలా సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘అత్త అంటే ఇలా ఉండాలి అమ్మలా, కోడలు అంటే ఇలా ఉండాలి కూతురిలా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కోడలి మీద సహజమైన ప్రేమని వ్యక్తపరిచిన విజయమ్మపై మీ అభిప్రాయం ఏమిటి? తల్లీకూతుళ్లలా కలిసి ఉంటున్న వీరిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.