ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమాల కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ఇవాళ ఆమెకు విముక్తి లభించింది. ఆమె కేసుని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆమెను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. దీంతో ఎవరీ శ్రీలక్ష్మి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిణి. 2007 నుంచి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు మరియు వాణిజ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి పని చేశారు. ఆ సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపణలు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా అక్రమ మైనింగ్ కి అనుమతులు ఇచ్చారన్న నెపంతో సీబీఐ ఆమెను ఓఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా చేర్చింది. ఓఎంసీ ప్రమోటర్ మరియు గాలి జనార్ధన్ రెడ్డితో కుమ్మక్కై అనంతపురంలో మైనింగ్ లీజులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని కేంద్ర ఏజెన్సీలు పేర్కొన్నాయి. 2009 డిసెంబర్ 7న శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది.
అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, మలపనగుడి గ్రామాల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మైనింగ్ తవ్వకాలకు ల్యాండ్ ను బళ్లారిలో ఉన్న ఓఎంసీ కంపెనీకి లీజుకిచ్చిన దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ శ్రీలక్ష్మిపై కేసు రిజిస్టర్ చేశారు. 2011 నవంబర్ 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని సస్పెండ్ చేసింది. ఏడాది పాటు చంచలగూడ జైల్లో ఉన్న శ్రీలక్ష్మి 2012 అక్టోబర్ నెలలో బెయిల్ మీద బయటకు వచ్చారు. 2016లో ఆమె సస్పెన్షన్ ను ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ కేటాయించిన ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. తెలంగాణ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ క్యాడర్ కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు తెచ్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాడర్ లో చేర్చుకుంది.
పురపాలక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. గత ఏడాది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రమోషన్ కూడా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో సీబీఐ ఫైల్ చేసిన అడిషనల్ ఛార్జ్ షీట్ ను సరైన ఆధారాలు లేని కారణంగా హైకోర్టు తోసిపుచ్చింది. గత నెలలో శ్రీలక్ష్మి పిటిషన్ ను సీబీఐ కోర్టు రద్దు చేయగా.. దాన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ని విచారించిన హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీలక్ష్మి విషయంలో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి జానార్ధన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టుతో సీబీఐ పోరాడుతున్న విషయం తెలిసిందే. మరి శ్రీలక్ష్మి విషయంలో సీబీఐ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.