ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఓపిక నశిస్తోంది.. కోపం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని.. జీవితాలను నాశనం చేసుకునేవారు కొందరైతే.. మరి కొందరు ఏకంగా.. తాము తప్పు చేసినా సరే.. అవతలి వారినే దోషులను చేస్తూ.. దాడి చేయడానికి కూడా వెనకడాటం లేదు. ఇలాంటి విషయాల్లో యువత తీరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డు మీదకు వచ్చి అల్లరి చేయడం.. వారించిన వారిపై దాడి చేయడం వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. వాహనం చేతిలో ఉంటే చాలు.. మాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నారు నేటి యువత. వాళ్లకు ఎవరైనా అడ్డం వచ్చిన లేక వారి బండిని ఓవర్ టేక్ చేసిన వాళ్ల అంతుచూసేదాకా ఆగడంలేదు. మనుషులమనే విచక్షణ కోల్పోయి.. దాడి చేస్తున్నారు.
విజయవాడలో ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది. నా బండినే గుద్దుతావా అని ఓ మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సు.. తన బైకును ఢీకొట్టిందంటూ ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం బస్సు డ్రైవర్‌ను చితకబాదింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.