కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు కోర్టులో చుక్కెదురయ్యింది. భార్యకు ప్రతి నెల 8 లక్షల రూపాయలు భరణంగా చెల్లించాల్సిందేనంటూ పృథ్వీరాజ్‌కి విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కి 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మి కొన్నాళ్ల క్రితం పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని.. సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన భర్త నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లో ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవారని శ్రీలక్ష్మి వెల్లడించింది. ఆ ఖర్చులన్నీ తన తల్లిదండ్రులే భరించేవారని చెప్పుకొచ్చింది. కానీ ఆయన సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత ఆయన తనను తరచూ వేధిస్తుండేవారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పృథ్వీ 2016 ఏప్రిల్ 5న తనను ఇంట్లో నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇక మీదట ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు ప్రతి నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు.
ప్రస్తుతం తన భర్త పృథ్వీరాజ్ సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఆయన నుంచి తనకు ప్రతి నెల భరణం ఇప్పించాలని కోరారు. ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఈ భరణం ఇవ్వాలని.. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని తీర్పు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.