తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ ఆలయం ప్రత్యేకతలు, ప్రాచుర్యం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రంపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆలయాల్లో తిరుమల కూడా ఒకటి. రోజూ లక్షల్లో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి హుండీ ఆదాయమే రోజుకు కోట్లలో వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఏర్పాట్లు, నిర్వహణ విషయంలో తితిదేని భక్తులంతూ మెచ్చుకుంటూనే ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు చేస్తూ ఉంటారు.
తితిదే అందించే సేవల్లో అన్న ప్రసాద వితరణ కూడా ఒకటి. తిరుమల కొండపై భక్తుల కోసం ఉచితంగా అన్న ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించే వెళ్తారు. అయితే చాలామంది ఈ అన్నప్రసాదం కోసం విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే చాలామందికి తాము కూడా అన్నదానం చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారికోసం టీటీడీ ఒకరోజు అన్నదాన విరాళం విధానాన్ని తీసుకొచ్చింది.
మీరు కావాలంటే ఒకరోజు మొత్తం తిరుమలలో జరిగే అన్న ప్రసాద వితరణకు విరాళం ఇవ్వవచ్చు. తిరుమలలో ఒకరోజు అన్న ప్రసాద వితరణకు రూ.33 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఉదయం అల్పాహారం కోసం రూ.7.70 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ.12..65 లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు చొప్పున ఖర్చవుతుందని తెలిపారు. భక్తులు అన్న ప్రసాద వితరణ చేయాలనుకుంటే వారు ఈ మొత్తాన్ని విరాళగా ఇవ్వవచ్చని వెల్లడించారు. అలా చేస్తే ఆ రోజు మొత్తం వారి పేరు మీద వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అంజేస్తారు.
అలాగే అన్న ప్రసాదం వితరణ చేసిన వారి పేరు, వివరాలను వెెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారని తెలిపారు. అలాగే విరాళం అందజేసిన వారు భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. మీరే స్వయంగా ఆరోజు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ అన్నదానం ట్రస్టు ఈ మేరకు వివారలను వెల్లడించింది. ఈ అన్న ప్రసాద వితరణ విరాళం విధానానికి విశేష స్పందన వస్తుందని భావిస్తున్నారు.