ఫ్లాష్…ఫ్లాష్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులోనే లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. వారధి దగ్గరికి వచ్చేసరికి లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో విజయవాడ డీసీపీ హర్షవర్థన్‌రాజుతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కనకదుర్గ వారధి దగ్గరికి చేరుకున్నారు. దీంతో వారధి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయనను అక్కడి నుంచి తరలిస్తున్నారు. లోకేశ్ కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు అనుసరిస్తున్నాయి. మీడియాతో లోకేశ్ మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.
ఏ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులపై లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. భారీగానే టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి లోకేశ్ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లోకేష్ వస్తున్నారని తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. లోకేశ్ ను పోలీసులు ఎక్కడకు తరలిస్తున్నారనే విషయంలో కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ నిర్ణయించారు. అదే విధంగా గుంటూరులో రమ్య హత్య జరిగి 21 రోజులైనా శిక్ష వేయలేదంటూ నిరసన తెలపాలనుకున్నారు. కొవిడ్ దృష్ట్యా నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.