sssలోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ.. వైఎస్సార్సీపీలో చేరనున్నారా? ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయనున్నారా?
ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ వైసీపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం సీఎం జగన్ ని జేపీ నారాయణ కలవడమే. విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో వేదికపై జగన్ పక్కనే జేపీ కూర్చున్నారు. ఆయన వస్తుంటే జగన్ లేచి నిలబడ్డారు. స్టేజ్ మీదకు రాగానే కరచాలనం చేశారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుతున్నారు. దీంతో జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరతారని ప్రచారం మొదలైపోయింది. అంతేకాదు.. వైసీపీ తరఫున విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే జేపీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జేపీ ఇలా వైసీపీ పార్టీ వైపు మళ్లడం ఏంటి? జగన్ తో కలవడం ఏంటి అని విమర్శిస్తున్నారు. అయితే జేపీ, జగన్ ల కలయికపై లోక్ సత్తా పార్టీ ఏపీ అధ్యక్షులు భీశెట్టి బాబ్జి స్పందించారు. జయప్రకాశ్ నారాయణ వైసీపీలో చేరతారని వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. గతంలో జేపీ ఆప్కాబ్ ఎండీగా పని చేసిన కారణంగా జగన్ పిలుపు మేరకు వేడుకల్లో పాల్గొన్నారని అన్నారు. జగన్ కి సూచనలు ఇవ్వడానికి మాత్రమే కలిశారని అన్నారు. ఆప్కాబ్ ఎండీగా పని చేసినప్పుడు తీసుకున్న చర్యలు, ఇప్పుడు ఆప్కాబ్ ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్ కి చెప్పడానికే సమావేశానికి జేపీ వెళ్లారని అన్నారు.
Iజగన్ సూచన మేరకు జేపీ వైసీపీలో చేరతారని.. విజయవాడ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని బాబ్జి అన్నారు. అయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని.. జేపీ ఎప్పుడూ రాజకీయ పార్టీలను ప్రేమించరని అన్నారు. ఆయన గొప్ప వ్యక్తి.. ఆయన ఒక శక్తిగా ఎదిగి అనేక రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారని.. అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు. వేరే పార్టీలో చేరాల్సిన అవసరం ఆయనకు లేదని.. ప్రజలు దీన్ని గమనించాలని అన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేసే ఆయన సలహాలు, సూచనలు ఇస్తారని.. ఈ క్రమంలోనే జగన్ ని కలిసి సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు. జేపీ వైసీపీలో చేరతారని వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు భీశెట్టి బాబ్జి పిలుపునిచ్చారు.