టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. నేడు ఆయన తన 73వ ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జీవిత విశేషాలు..
బాల్యం-విద్యాభ్యాసం…చంద్రబాబు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. చంద్రబాబు తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో 1972లో బి.ఎ., తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. చంద్రబాబు యుక్త వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉండేవాడు. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్‌లో చేరాడు.
రాజకీయ జీవితం..చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో 28వ ఏటనే సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితుడయ్యి.. చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1980-83 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేశాడు. అదే సమయంలో 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు. వారికి ఓ కుమారుడు లోకేష్ ఉన్నాడు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కోరిక నెరవేర్చిన CM జగన్!1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం తెలుగుదేశంలో చేరాడు. 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ను గద్దె దింపాలని చేసిన కుట్రను చంద్రబాబు తిప్పికొట్టి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. చంద్రబాబు తెలుగుదేశం తరఫున ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య.. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి.. 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు.
ముఖ్యమంత్రిగా (1995-2004)..ఏపీకి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చారు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి “విజన్ 2020” పేరుతో ఓ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.
ఇది కూడా చదవండి: నారా చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది: రాఘవేంద్రరావు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను ప్రారంభించాడు. జన్మభూమి, ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమాలను రూపొందించాడు. సాంకేతికాభివృద్ధిని అర్థం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనంగా నిలిచింది.
జాతీయ రాజకీయాలపై ప్రభావం..1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ సమయంలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసి.. దేవెగౌడ ప్రధాని అయ్యేలా చేశారు.
ఇది కూడా చదవండి: మనవడు దేవాన్ష్ పుట్టినరోజు.. భారీ విరాళం ఇచ్చిన చంద్రబాబు!
ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ చంద్రబాబు దాన్ని సున్నితంగా నిరాకరించాడు.
రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర..రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు.
2003 హత్యా ప్రయత్నం..2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.
2004-09 ఎన్నికల్లో ఓటమి..చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత.. 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి పాలయ్యింది.
2014 ఎన్నికల్లో విజయం..చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు గాను 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
2019 ఎన్నికల్లో ఓటమి..చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో YSRCP చేతిలో ఓడిపోయింది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు పలువురు ప్రముఖుల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు కూడా కామెంట్స్ రూపంలో చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి.