అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో అమెరికా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గడ్డ కట్టే చలికి బయటకు రాలేక.. తినడానికి ఏమీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కొన్ని అడుగుల లోతు మేర మంచు పేరుకుపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. చాలా మంది వాహనదారులు కార్లలోనే చిక్కుకుపోతున్నట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. రెండు రోజులుగా ప్రజలు వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ కి అంతరాయం ఏర్పడడంతో 15 లక్షల మంది విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నారు.
బాంబ్ సైక్లోన్ గా పిలవబడుతున్న ఈ మంచు తుఫాను ప్రభావం అమెరికాలోని పది రాష్ట్రాలపై తీవ్రంగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. న్యూయార్క్, విస్కాన్సిన్, నెబ్రాస్కా, మిచిగాన్, మాంటెన్నా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిన్నెసోటా, ఐయోవా, ఇండియానా రాష్ట్రాలు ఉన్నాయి. న్యూయార్క్ లోని స్నైడర్ లో 56 అంగుళాలు అంటే సుమారు 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ లోని వాటర్ టౌన్ లో 34 అంగుళాలు, మిచిగాన్ లోని బరగాలో 42 అంగుళాల మంచు కురిసింది. భారీ మంచు కారణంగా అత్యవసర వాహనాలు సైతం రోడ్లపై స్తంభించిపోతున్నాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలా మంది చనిపోతున్నట్లు అమెరికన్ మీడియా ప్రకటించింది.
కొందరు ఐతే వాహనాల్లోనే ప్రాణాలు విడిచినట్లు తెలిపింది. దాదాపు 20 కోట్ల మంది ఈ బాంబ్ సైక్లోన్ ప్రభావానికి గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. చలి తీవ్రత కారణంగా అమెరికా దేశ వ్యాప్తంగా 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలో 28 మంది ప్రాణాలు విడిచినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయులు సైతం గడగడలాడిపోతున్నారు. గడ్డకట్టే చలికి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అరిజోనాలో మంచు తుఫాను బీభత్సం కారణంగా.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపుర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు గల్లంతయ్యారు. అధికారులు అతి కష్టం మీద హరిత మృతదేహాన్ని వెలికి తీశారు. భర్త ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఏడాది జూన్ లో నారాయణ, హరిత దంపతులు పాలపర్రు వచ్చారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.