ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై అసహనంలో విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు.
ఇటీవల చాలామంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురైతూ డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో సహనం కోల్పొయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు చంపడం లేదా తమ జీవితాన్ని అంతం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి మనోవేదనకు గురై పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంట్లో భార్యపై గొడవ పడి తీవ్ర అసహనానికి గురైన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే..
అగ్రరాజ్యం అయిన అమెరికాలో కొంతకాలంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. మైనర్లు సైతం చేతిలో గన్ పట్టుకొని తిరగడమే కాదు.. విచ్చలవిడి కాల్పులు జరుపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజగా కాలిఫోర్నియాలో కాల్పుల మోత మోగింది. ఇక్కడ ఆరేంజ్ కౌంటీలో ప్రముఖ బైకర్స్ బార్ వద్ద ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.
నిందితుడు రిటైర్డ్ పోలీస్ అధికారి అని.. కొంత కాలంగా తనను దూరంగా పెడుతున్న భార్యను చంపే ప్రయత్నంలో నిందితుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తుంది. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్తితిని చక్కదిద్దారు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం పదకొండు మందిపై కాల్పులు జరపగా నిందితుడి సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.