బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటకు పెట్టరాదు అని డ్రైవర్, కండక్టర్‌లు వారిస్తూనే ఉంటారు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం వారి మాటలను లెక్క చేయక.. చేతులు బయటకు పెట్టి చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. కొందరు కావాలని సరదాకి చేస్తే.. మరి కొందరు ఏమారపాటుగా ఉండో.. లేక నిద్ర మత్తులోనే చేతులు బయటకు పెట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కి నిద్రపోయిన మహిళ.. ఆ మత్తులో చేతిని కిటీకి గుండా బయటకు పెట్టింది. దాంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె చేయి తెగి పడిపోయింది. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి అనే మహిళ.. శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు బస్సులో వచ్చింది. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు ఎక్కింది. డ్రైవర్ వెనుక వరుసలోని విండో సీట్ లో కూర్చుంది. బస్సు బయలుదేరిన కాసేపటికే కునుకుతీసింది. ఈ క్రమంలో చేయి బయటకు పెట్టింది. బస్సు వీరఘట్టంలోని హైస్కూల్ వద్దకు చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న ఆటో బస్సుకు రాసుకుంటూ వెళ్లింది. ఆటో పై భాగంలో ఉండే ఇనుప రాడ్డు గలడంతో ఆమె చేయి తెగిపడిపోయింది. పైడితల్లి కేకలు వేయడంతో స్పందించిన ప్రయాణికులు ఆమెకు సపర్యలు చేసి వీరఘట్టం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.