విద్యార్ధి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యే, మంత్రి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. నట సార్వభౌముడు, నందమూరి తారక రామరావు గారి కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్బంగా చంద్రబాబు, భువనేశ్వర్‌ల పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి పత్రికలో చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు ఉంది. ఎన్.టి. రామారావు కుమార్తె భువనేశ్వరిని తాను వివాహం చేసుకుంటున్నాని… అందరు రావాలని..బాబే ఆహ్వానిస్తున్నట్లు ఆ పత్రిక ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్ధి దశ చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. దీంతో మొదట కాంగ్రెస్ కార్యకర్తగా చేరి.. ఆతరువాత ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన కొన్నిపరిణామాలతో టీడీపీలోకి వెళ్లారు. చివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి.. తనదైన పరిపాలనతో ప్రత్యేక గుర్తింపు సంపాందించారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..చంద్రబాబు,భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది.
ఈ పెళ్లి వేడుక జరిగే నాటికి ఎన్టీఆర్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. దీంతో ఈ పెళ్ళికి అప్పట్లో ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ పెళ్లి గురించే అన్ని మీడియాలలో వార్తలు వచ్చేవి. సినీ, రాజకీయ కుటుంబల మధ్య జరిగే వేడుక కావడంతో పెద్ద సంఖ్యలో అతిధులు వచ్చారు. ఓ వైపు రాజకీయ ప్రముఖులు, మరో వైపు సినిమా తారలు ఈ పెళ్ళికి హాజరయ్యి సందడి చేశారు. చంద్రబాబే స్వయంగా అందరిని ఆహ్వానిస్తున్నట్లు ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం ఇలా ఉంటే.. కట్న కానుకులకు సంబంధించిన పలు వార్తలు వచ్చేవి. ఎన్టీఆర్ ఇంత కట్నం ఇచ్చి ఉంటాడని, చంద్రబాబు అంత కట్నం తీసుకుని ఉంటారని.. ఇలా చాలా అనేక రకాలుగా మాట్లాడుకునేవారు.
అయితే నిజానికి చంద్రబాబు నాయుడు ఒక రూపాయి కూడా కట్నం తీసుకోకుండా భువనేశ్వరిని చేసుకున్నారట. చంద్రబాబు అసలు అడగనేలేదట, ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వడానికేమి ముందుకురాలేదట. కానీ.. వీరి వివాహ వేడుక అప్పట్లోనే అంగరంగ వైభవం గా జరిగింది. చంద్రబాబు, భువనేశ్వర్‌ల పెళ్లి ఫోటోలు, పెళ్లి పత్రిక సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అంతే కాక నాడు చంద్రబాబు స్వయంగా తన పెళ్లికి ఆహ్వానించిన లేఖ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతోంది. నాటి పసుపుకుంకుమ తో ఉన్న ఈ లేఖ ఇప్పుడు సోషల్ చక్కర్లు కొడుతోంది.