వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నెల్లూరు నగరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశాడు. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనిల్ మరోసారి అవకాశం దక్కకపోవడంతో.. ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యాడు. ఇక ప్రత్యుర్థుల మీద విరుచుకుపడటంలో.. ఘాటు వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు అనిల్ కుమార్. ప్రభుత్వాన్ని కానీ.. సీఎం జగన్‌ని కానీ ఎవరైనా ఏమైనా అంటే.. వెంటనే రంగంలోకి దిగి.. వారికి తగిన రీతిలో కౌంటర్ ఇస్తారు. ఇక మంత్రి బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పెద్దగా కనిపించడంలో లేదు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివారాలు..
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి. శుక్రవారం రాత్రి.. నెల్లూరు ఆదిత్య నగర్‌లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం మున్సిపల్ పార్కును సందర్శించారు కోటి. ఈ సందర్భంగా ఆయన.. ఎమ్మెల్యే అనిల్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు ప్రజల అభిమానం మర్చిపోలేనని.. వారి అభిమానంతోనే ఇప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తున్నాను అన్నారు కోటి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు కోటి.
ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ‘‘అనిల్ కుమార్ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అనిల్‌ని కలవడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత చిన్నవయసులోనే ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి ఎంతోమందికి ఆదర్శం. అనిల్ పొటిలికల్ రంగంలో పవర్ స్టార్’’ అని ప్రశంసిచారు. ఇక రాజ్ కోటిగా తాము సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూసి.. నెల్లూరు ప్రజలు.. మ్యూజిక్ ఏం కొట్టార్రా.. అంటూ తమను ఆదరించడం ప్రారంభించారని.. ఇప్పటికి.. తమపై అంతే అభిమానం చూపుతారని సంతోషం వ్యక్తం చేశారు. తాను నెల్లూరు అల్లుడినని.. ఇక్కడ అందరూ తనకు స్నేహితులే అన్నారు కోటి.