అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ రెండవ కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడి అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండవ కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు చేపట్టారు. కూకట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఆమె ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో అక్కడ నారాయణ తన పేరు, బంధువుల పేర్ల మీద భూములు అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సుమారు 150 ఎకరాల అస్సైన్డ్ భూమిని కొనుగోలు చేసినట్లు ఏపీ సీఐడి విచారణలో వెల్లడైంది. ఈ కేసులోనే ఆయన కుమార్తె ఇంట్లో శుక్రవారం సీఐడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ సీఐడి మూడేళ్ల క్రితమే కేసు నమోదు చేసింది. ఆ ప్రాంతంలోని వేర్వేరు గ్రామాల్లో ఏపీలోని రాజధాని 89.9 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన కేసులో ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇలా వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్ భూములు మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ, ఆయన బంధువులు, తెలిసినవారి పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో నెల్లూరులోని నారాయణ నివాసంలో దాడులు చేసింది. అప్పట్లో జరిగిన ఈ సోదాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోళ్లు, అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద సీఐడి పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కూడా నోటీసులు పంపింది. అయితే గత నెలలో కూడా మాదాపూర్ లోని నారాయణకు చెందిన ఓ సంస్థలో సైతం ఏపీ సీఐడి సోదాలు చేపట్టింది. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.