పనికిరాని చెత్తతో నీళ్ళల్లొ ఈదేలా కొత్త దీవి!..

ప్లాస్టిక్‌ కవర్లు.. డబ్బాలు.. బాటిళ్లు.. పొద్దున లేచిన దగ్గర్నుంచీ వాడే పాలప్యాకెట్‌ నుంచి సమస్తం ప్లాస్టిక్‌మయం. ఆ ప్లాస్టిక్‌ చెత్తంతా ఇలా నాలాల్లోకి చేరుతోంది. ఉందన్న విషయమే తెలియనంతగా ప్లాస్టిక్‌ చెత్త కప్పేసింది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టాలనే ప్రసంగాలు వినపడతాయి. కానీ.. తేదీ మారగానే ప్లాస్టిక్‌ సంగతీ అందరూ మర్చిపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇకనుంచైనా ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని భావితరాల వారికి ఉపయుక్తమయ్యేలా ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ మార్గోట్‌ క్రసోజెవిక్‌ నీటిమీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్‌ రిసార్ట్‌ను డిజైన్‌ చేశారు. దీనికి ‘రీసైకిల్డ్‌ ఓసియన్‌ ప్లాస్టిక్‌ రిసార్ట్‌’గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కీలింగ్‌ దీవుల దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్‌ మొదలుపెట్టారు. హిందూ మహా సముద్రంలో చేరిన ప్లాస్టిక్‌ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

14b77ce6d94bebb347b47ea6604cabe1‘ఫ్లోటింగ్‌ ఐలాండ్‌ రిసార్ట్‌’ కోసం ముందు కలప, బయో డీగ్రేడబుల్‌ ఫైబర్‌ కాంక్రీట్‌ మెష్‌ మెల్లగా క్షీణిస్తూ పర్యావరణంలో కలిసిపోయే ఫైబర్‌ వలతో ప్రధాన నిర్మాణాన్ని కడతారు. దానికి చుట్టూ మెష్‌తో ‘వాక్‌ వే’లు -అదే … నడిచే దారులు నిర్మిస్తారు. ఐలాండ్‌ రిసార్ట్‌ నీటిపై తేలుతూ, స్థిరంగా ఉండటానికి ఆయిల్‌ రిగ్స్‌ చమురు తవ్వితీసే కేంద్రాల తరహాలో ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. ఈ ఐలాండ్‌ సముద్రంలో తేలుతూ కదులుతున్న కొద్దీ ఈ వలలో ప్లాస్టిక్‌ చెత్త చిక్కుతూ ఉంటుంది. దానిని గట్టిగా సంచుల్లో నింపి ఈ వాక్‌వేలలోనే గట్టిగా బిగిస్తారు. వాటిపై కాస్త ఇసుక, మట్టి వంటివి పరిచి, దారుల్లాగా మార్చుతారు. ఈ వాక్‌వేలు పూర్తయ్యాక చుట్టూ మరిన్ని మెష్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో చిక్కుకునే ప్లాస్టిక్‌ చెత్తతో వాక్‌వేలను రూపొందిస్తారు. ఇలా దీవిని విస్తరించుకుంటూ వెళ్లవచ్చని రూపకర్తలు చెప్తున్నారు.