అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీలను గెలువడం అంత తేలక కాదని.. ప్రతి జట్టు కప్పుకోసమే ప్రాణం పెట్టి పోరాడుతుందని భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అంటున్నాడు.
మరో రెండు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. టీమిండియా దానికోసం ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడిన భారత్ 2-1తో ట్రోఫీ కైవసం చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చిన ఈ సిరీస్ లో కొందరు ఆకట్టుకోగా.. మరికొందరు నిరాశ పరిచారు. అంతకుముందు టెస్టు సిరీస్ లో రాణించిన టీమిండియా 1-0 తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ద్వైపాక్షిక సిరీస్ లు నెగ్గడానికి ఐసీసీ మెగాటోర్నీల్లో రాణించడానికి తేడా ఉందని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొంటున్నాడు. ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పోటీ అధికంగా ఉండటంతో పాటు.. ప్రతి జట్టు గెలువాలనే కసితోనే ఆడుతుందని పేర్కొన్నాడు.
‘స్వదేశంలో జరుగబోయే టోర్నీ కోసం టీమిండియా రెడీ అవుతుంది. అయితే మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి జట్టు.. కప్పు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే వరల్డ్ కప్ లో అడుగుపెడతాయి. మన జట్టు కూడా దాని కోసమే ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ కప్ గెలువడం అంత సులువైన విషయమేం కాదు. గతంలో టీమిండియా చాలాసార్లు సెమీఫైనల్స్ వరకు వెళ్లింది. దాదాపు అన్ని పెద్ద టోర్నీల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే తమది కాని రోజున ఏదీ కలిసి రాదు అన్నట్లు.. ఆ రోజు మనవాళ్ల ఆట తీరు బాగాలేక పరాజయం పాలైంది. అభిమానులకు నా విన్నపం ఏంటంటే.. ప్రపంచకప్ గెలువకపోయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. మనం ముందుకు సాగాల్సిందే. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో గెలిస్తే అభినందిద్దాం.. ఓడితే అండగా నిలుద్దాం. భారత్ పై ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లకు అభిమానుల అండ అవసరం. ప్రజలు మా వెంట ఉన్నారు.. అని ఆటగాళ్లకు విశ్వాసం కలిగితే వారు మరింత బాగా రాణిస్తారు’ అని అశ్విన్ వివరించాడు.
ఇక చాన్నాళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్ కే పరిమితమవుతున్న అశ్విన్.. ఇటీవల వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో అదరగొట్టాడు. వన్డే, టీ20 సిరీస్ లకు ఎంపిక కాకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన అశ్విన్ జట్టు సభ్యుల్లో మనోధైర్యం నింపే వ్యాఖ్యలు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే అశ్విన్ ప్రపంచ క్రికెట్ లో పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే విషయం తెలిసిందే. ఇటీవల యాషెస్ సిరీస్ లో భాగంగా స్టీవ్ స్మిత్ రనౌట్ విషయంలోనూ అశ్విన్ అంపైర్ నిర్ణయాన్ని అభినందించి వార్తల్లో నిలిచాడు. ఇక అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. 8న భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.