భారత్‌తో సిరీస్ ఆడితే చాలని చాలా దేశాల క్రికెట్ బోర్డ్‌లు ఎదురుచూస్తుంటే.. వెస్టిండీస్ మాత్రం సుదీర్ఘ పర్యటనలో కనీస ఏర్పాట్లు చేయలేక తిప్పలు పడుతోంది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా గుర్తింపు సాధించిన టీమిండియాతో మ్యాచ్‌లు ఆడేందుకు వివిధ దేశాల జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. భారత్‌తో సిరీస్ అంటే ప్రత్యర్థి బోర్డ్‌లు ఏర్పాట్లకు కొదవ రాకుండా చూసుకుంటాయి. కానీ, వెస్టిండీస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
విలాసవంతమైన సౌకర్యాలు లేకున్నా.. కనీస స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయలేదని పాండ్యా వెల్లడించగా.. అశ్విన్ మరో అడుగు ముందుకేసి పిచ్‌పై పచ్చిక లేదని.. నెట్స్ కూడా పాతవే అని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ చేసేందుకు సరైన సదుపాయాలు కల్పించడంలోనూ విండీస్ బోర్డు విఫలమైందని అన్నాడు. తాజాగా విండీస్ బోర్డు మరో తప్పిదం బయటపడింది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడో పోరు ప్రారంభానికి ముందు జరిగిన ఓ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
టాస్ అనంతరం 30 నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. హార్దిక్ సేన ఫీల్డింగ్ కోసం మైదానంలో అడుగుపెట్టింది. జట్టు సభ్యులంతా ఒక చోట గుమిగూడి వ్యూహాలు రచించుకున్న అనంతరం ఆటగాళ్లు ఎవరికి నిర్దేశించిన స్థానానికి వారు చేరుకుంటుండగా.. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది అనుకుంటే.. అంపైర్లు ఆటగాళ్లను గ్రౌండ్ నుంచి బయటకు రావాల్సిందిగా కోరారు. అసలు విషయం ఏంటా అని పరిశీలిస్తే.. మైదానంలో 30 యార్డ్స్ సర్కిల్ మార్కింగ్ కనిపించలేదు.
దీంతో పాండ్యా సేన తిరిగి డగౌట్ కి చేరగా.. సిబ్బంది ఆ ఏర్పాట్లు చేశారు.ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తున్నప్పుడు కనీస సదుపాయాలు కల్పించాలనే సోయి కూడా విండీస్ బోర్డుకు లేకుండా పోయింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభం కాగా.. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘ఇలాంటి ఒక కారణం వల్ల కూడా మ్యాచ్ ఆగుతుందని ఎవరైనా ఊహిస్తారా! అందుకే అక్కడ పర్యటించడం అంత సులువైన విషయం కాదు అనేది ఓ ప్లేయర్‌గా ఎప్పుడూ ఊహించనిది.
ఏదో జరగబోతుందని ముందే అనుకోవడం మంచిది’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇంత వెనుకబడి ఉంటే.. క్రీడాభివృద్ధి ఎలా సాధ్యమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారత్ వంటి జట్టుతో సిరీస్ ఆడితే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అనుకుంటే సరిపోదని.. దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేయాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.