స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఎవరిని ఉంచాలీ.. ఎవరిని తీయాలీ అని ఓ వైపు టీమిండియా మల్లగుల్లాలు పడుతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం రెండు నెలల ముందే జట్టును ప్రకటించేసింది.
వన్డే ప్రపంచకప్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా.. ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న ఆస్ట్రేలియా.. ఈసారి కూడా ఫేవరెట్ గానే బరిలోకి దిగనుంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ కోసం ఆసీస్ రెండు నెలల ముందుగానే జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ లో టీమిండియాతో తలపడనుంది. అయితే అంతకుముందు కంగారూ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. వైట్ బాల్ సిరీస్ ల్లో భాగంగా వన్డే, టీ20లు ఆడనుంది. అటు నుంచి నేరుగా.. భారత్ లో అడుగుపెట్టనున్న కంగారూలు.. మొదట మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనున్నారు. ఆ తర్వాత ప్రపంచకప్ జరుగనుండగా.. అది ముగిసిన వెంటనే ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లకుండా.. భారత్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే సన్నద్ధతలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండే కంగారూలు.. ఈ టోర్నీల కోసం అప్పుడే జట్టును ప్రకటించారు. ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20ల్లో మిషెల్ మార్ష్ ను సారథిగా ఎంపిక చేశారు.
టెస్టు స్పెషలిస్ట్ మార్నస్ లబుషేన్ కు మెగాటోర్నీ జట్టులో చోటు దక్కకపోగా.. ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరం కానున్నాడు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించిన విధ్వంసక ఓపెనర్ డేవిడ్వ వార్నర్ తో పాటు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నారు. ఈ నెలాఖరున దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న ఆసీస్ వచ్చే నెల 17న ఆ టోర్నీ ముగించుకొని నేరుగా భారత్ లో అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా 22 నుంచి రోహిత్ సేనతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ పై విజయం సాధించడంతో పాటు.. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ను నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ప్యాట్ కమిన్స్.. వన్డే వరల్డ్ కప్ లోనూ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇంకా జట్టును ఫైనల్ చేయలేకపోగా.. విదేశీ జట్లు మాత్రం అప్పుడే అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు.
వన్డే ప్రపంచకప్ కు ఆసీస్ జట్టు ఇదే:
కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, మార్కస్ స్టొయినిస్, మిషెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆస్టిన్ అగర్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, మిషెల్ స్టార్క్, జోష్ హజిల్ వుడ్, నాథన్ ఎలీస్.