ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌ లోకి చాహల్‌..! టీమ్‌ మారుతోందా?

chahal

ఐపీఎల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎంతో మంది అద్భుత ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్‌కు అందించిన ఘనత ఐపీఎల్‌ సొంతం. ఎంతో మందిని స్టార్లను చేసింది.. గాడి తప్పిన వారికి తిరిగి ఫామ్‌ను అందుకునేందు దోహదం చేసింది. అలా ఇప్పుడు స్టార్‌ స్పిన్నర్‌ చాహల్‌కు మరోసారి తనను తాను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ వేదికగా నిలిచింది. అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ స్క్వాడ్‌లో  చాహల్‌కు చోటు దక్కలేదు. ఆ అంశంపై పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది.. జరుగుతోంది. మాజీలు సైతం దీనిపై ప్రశ్నించారు. ముఖ్యంగా సెహ్వాగ్‌ సెలక్షన్‌ కమిటీని నిలదీశాడు. ఐపీఎల్‌ 2021 ఫస్ట్‌, సెకెండాఫ్‌లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

chahal viratచాహల్‌ను కోరుకుంటున్న కోహ్లీ

టీ20 ప్రపంచ కప్‌ టీమ్‌ సెలక్షన్‌లో కోహ్లీ పాత్ర లేదు అనే వాదన కూడా ఉంది. విరాట్‌ను సంప్రదించకుండానే జట్టు ఎంపిక జరిగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. చాహల్‌ను కాదని రాహుల్‌ చాహర్‌కు జట్టులో స్థానం కల్పించడంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నింటిపై బీసీసీఐ అధికారులు, ఎంపిక కమిటీ స్పిందించింది లేదు. ఇప్పుడు చాహల్‌ ప్రదర్శనను చూపించి.. అతడ్ని జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు చాహర్‌ సరైన ప్రదర్శన చేయకపోవడం వారికి తలనొప్పిగా మారింది. ఏ రకంగా చూసినా చాహల్‌ను జట్టులోకి తీసుకోక తప్పేలా లేదని టాక్‌ కూడా వినిపిస్తోంది. అక్టోబర్‌ 10 వరకు జట్టును మార్చుకునే అవకాశం ఉన్నందున బీసీసీఐ తప్పకుండా జట్టులో మార్పులు చేస్తుందని సమాచారం. ఐపీఎల్‌లో సెకెండాఫ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, చాహర్‌ సరైన ప్రదర్శన చేయడం లేదు. వీరి స్థానంలో చాహల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అభిప్రాయాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి.

చాహల్‌, రాహుల్‌ చాహర్‌ వీరిలో ఎవరు టీమ్‌లో ఉంటే బావుంటుందని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.