ఒకే వేదికపై కేసీఆర్, జగన్.. పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు!

Jagan Kcr Ap Telangana

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య.. ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ పెరిగిన మాట కాదనలేని వాస్తవం. ముఖ్యంగా నదీ జలాల పంపకం విషయంలో కేసీఆర్, జగన్ ఒకరి పద్దతిపై మరొకరు విమర్శలు సైతం చేసుకున్నారు. కానీ.., ఇప్పుడు ఓ శుభ కార్యక్రమం పుణ్యమా అంటూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికని పంచుకున్నారు.

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడితో శంషాబాద్‌లోని వీఎంఆర్ గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి వధువరులను ఆశీర్వదించారు. కేసీఆర్, జగన్ ఈ వివాహ మంటపంలోకి ఒకేసారి ఎంట్రీ ఇవ్వడం విశేషం.

వధూవరులను ఆశీర్వదించాక ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చొని 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరు వేరు వేరుగా అక్కడ నుండి పయనమవ్వడం విశేషం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇదే తొలిసారి. అయితే ఇద్దరు సీఎంలు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నట్లుగా సమాచారం.