వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి తిరుమల తిరుపతి దేవస్థానం

అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం.. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన కోవెల. తిరుమల శ్రీవారు ప్రపంచ ప్రఖ్యాతి. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల తరలివస్తుంటారు. అంతటి ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో మరే ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లండ్‌ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.

ఈ మేరకు టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం తిరుమలలో ఈ సర్టిఫికెట్‌ ను అందుకున్నారు. ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ కప్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో టీటీడీకి చోటు కల్పించడం సంతోషంగా ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

TTD 1

టీటీడీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టీటీడీకి ఈ గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తూ, సదుపాయాలు కల్పిస్తోందని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్బంగా అన్నారు.

మామూలు రోజుల్లో సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తున్నామని చెప్పారు. ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతి రోజు మూడు లక్షల యాబై వేలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేసి భక్తులకు అందిస్తున్నామని గుర్తు చేశారు. టీటీడీ కల్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.