సైనా- సిద్దార్ధ్ వివాదం.. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ కేసు నమోదు

హైదరాబాద్- స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, తమిళ నటుడు సిధ్దార్ధ్ మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. ట్విట్టర్ లో మొదలైన ఈ అంశం, చివరికి సిద్దార్ధ్ భహిరంగ క్షమాపణతో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హీరో సిద్ధార్ద్ పై తెలంగాణలో పోలీసు కేసు నమోదవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ మొన్న పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్టార్ బాడ్మింటన్ సైనా నెహ్వాల్ ఈ అంశంపై స్పందిస్తూ.. దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా.. అంటూ ట్వీట్‌ చేసింది. సైనా నెహ్వాల్ ట్వీట్ పై హీరో సిద్ధార్థ్‌ వ్యంగంగా ట్వీట్ చేశారు.

Saina Siddharth 1

ఓ చిన్న కాక్‌ తో ఆడే ప్రపంచ చాంపియన్.. అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో పోస్టు చేశాడు. డబుల్ మీనింగ్ తో కూడిన ఈ కామెంట్ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. సైనాపై సిద్దార్థ్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. జాతీయ మహిళా కమీషన్ సైతం సిధ్దార్ధ్ కామెంట్స్ పై సీరియస్ అయ్యింది. దీంతో తన తప్పు తెలుసుకున్న సిద్దార్ధ్, సైనాకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు.

తాను కేవలం జోక్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్‌ చేశానని, ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. సైనా ఎప్పటికీ మన చాంపియనే అంటూ సిద్దార్ధ్ ట్వీట్ చేశాడు. దీనికి సైనా కూడా స్పందించారు. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఇదిగో ఇంతటితో ఈ వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిద్దార్ధ్ పై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది.

సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పిన తీరు కూడా సరిగా లేదని తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ అంటున్నారు. ఈమేరకు ఆమె సిద్దార్ధ్ పై పోలీసులకు పిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సిద్ధార్థ్‌ పై సెక్షన్‌ 67 యాక్టు, ఐపీసీ 509 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తిపుగుతుందోనని సర్వత్రా ఆసక్కి నెలకొంది.