న్యూ ఢిల్లీ- దేశంలో కరోనా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధాని రాష్ట్రాలను కోరారు. రెమ్‌డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాక్టివ్ కేసులు ఒక లక్షకు పైగా ఉన్న 12 రాష్ట్రాల్లో పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల పెంపు గురించి కూడా మోదీకి అధికారులు వివరించారు.
ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి త్వరితగతిన, వేగంగా తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సమస్యాత్మక జిల్లాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రాలను ఆదేశించాలని మోదీ అధికారులకు సూచించారు. 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను, ఆక్సిజన్ లేదా ఐసీయూ బెడ్స్ 60 శాతానికి పైగా నిండిన జిల్లాలను సమస్యాత్మక జిల్లాలుగా పరిగణించాలని ప్రధాని స్పష్టం చేశారు. ఇక దేశంలో కరోనా టీకా కార్యక్రమంపై కూడా ప్రధాని ఆరా తీశారు. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 17 కోట్ల 70 లక్షల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసినట్లు అధికారులు మోదీకి తెలిపారు.
ఇక 45 ఏళ్ళ వయసు పైబడినవారిలో సుమారు 31 శాతం మంది కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు వారు చెప్పారు. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్లు వృథా అవుతున్న తీరును ఈ సమావేశంలో సమీక్షించారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా జరగాలని, ఈ వేగాన్ని తగ్గించకూడదని రాష్ట్రాలకు చెప్పాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్ హర్షవర్ధన్, పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు.