రాజమండ్రి- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఆతరువాత స్థానిక బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప.. వంగేది లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు.
తనకు రాజకీయాలంటే సరదా కాదని, ఒక బాధ్యతగా తీసుకున్నానని ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశంలో అన్నీ కులాలను కలుపుకొని పోవాల్సిన అవనసం ఉందని అన్నారు. తాను కమ్మ కులస్తులకు వ్యతిరేకం కాదని చెప్పిన పవన్, 2014లో తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ సత్తా సరిపోవడం లేదని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు బీజేపీ కార్యకర్తలను కూడా వదలడంలేదని మండిపడ్డారు. అంధ్రప్రదేశ్ లో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్ కళ్యామ్, ఈ యుద్ధంలో తాను చనిపోతే దేశం నలుమూలలా పిడికెడు మట్టి వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జనసైనికులను అడ్డుకోకుంటే సుమారు లక్ష మందితో సభ జరిగేదని అన్నారు.
ఇక రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదన్న ఆయన, రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ అని అన్నారు. తాను నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసని పవన్ కామెంట్ చేశారు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి.. నిలబడేందుకు వచ్చానని ఘాటుగా వ్యాఖ్యానించారు. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వం ఖాజానాకు వెళ్తాయన్న పవన్ కళ్యామ్, ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయని, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.